Supreme Court : సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు ఆగ్రహం
కవితకు బెయిల్ మంజూరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిందన్నారు..ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది.
- By Latha Suma Published Date - 06:33 PM, Thu - 29 August 24

Supreme Court : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి కారణం బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన రహస్య ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పై సుప్రీకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
We’re now on WhatsApp. Click to Join.
కవితకు బెయిల్ మంజూరైన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. బీజేపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికలకు ముందే ఒప్పందం జరిగిందన్నారు. ” లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బీజేపికి మళ్లించడమే ఆ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఆ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ మంజూరయింది” అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పతాక శీర్షికలకెక్కాయి. తాజాగా ఇదే అంశంపై న్యాయమూర్తులు బీఆర్ గవాయి, పికే మిశ్రా, కేవి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున.. ఆ కేసు విచారణను మధ్యప్రదేశ్ హై కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా దాఖలైన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున వారు సాక్ష్యులను ప్రభావితం చేయడంతో పాటు ఆధారాలను తారుమారు చేయొచ్చని పిటిషనర్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓటుకు నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్ కోర్టుకు బదిలీ చేయడంపై అయిష్టత వ్యక్తంచేసిన సుప్రీం కోర్టు.. తెలంగాణ హై కోర్టుపై విశ్వాసం వ్యక్తంచేసింది. అదే సమయంలో కవితకు బెయిల్ మంజూరు విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని మార్చుకోవాల్సిందిగా స్పష్టంచేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ప్రశ్నించింది. రాజకీయ నాయకులకు, న్యాయవ్యవస్థకు మధ్య పరస్పర గౌరవం ఉండాలని సూచించింది. ” రాజకీయ కారణాలతో తాము కోర్టులో ఆదేశాలు ఇస్తాం” అని అలా ఎలా మాట్లాడతారని సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది.
” దేశంలో ఇదే సర్వోన్నత న్యాయస్థానం. ఇలా తప్పుగా మాట్లాడినందుకే నిన్ననే మధ్యప్రదేశ్ అడిషనల్ సీఎం రాజేష్ కుమార్‌కి నోటీసులు పంపించాం” అని సుప్రీం కోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. సుప్రీం కోర్టు న్యాయాన్ని అనుసరించడం లేదని రాజేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కోర్టు.. మీపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి విషయంలోనూ సుప్రీం కోర్టు గుర్తుచేసింది. ఏదైనా రాజకీయ పార్టీలను సంప్రదించిన తరువాత మేము ఆర్డర్స్ జారీచేస్తామా అని ప్రశ్నిస్తూ ఈ పిటిషన్ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.