Food Adulteration: ఆహార పదార్థాల కల్తీపై ప్రత్యేక నిఘా పెట్టాలి: మేయర్
హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
- By Gopichand Published Date - 06:52 PM, Wed - 13 November 24

Food Adulteration: హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు (Food Adulteration) నిరంతరం పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో నగరంలో ఆహార భద్రత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ, అనుబంధ శాఖల అధికారులు మరింత సమర్థవంతంగా, అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాలలో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఏ.ఎం అండ్ హెచ్.ఓలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని తెలిపారు. నగరంలోని అన్ని ప్రదేశాల్లో ఆహార పదార్థాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, తనిఖీల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
ఫుట్ పాత్ లపై తినుబండారాల స్టాళ్లను ప్రత్యేకంగా తనిఖీలు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి షాప్ నుండి ఆహార నమూనాలు సేకరించి విశ్లేషణ చేసి నివేదిక అందించాలని సూచించారు. కల్తీ ఆహారాన్ని నివారించేందుకు ప్రత్యేక నిఘా కొనసాగాలన్నారు. నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహార నియంత్రణకు వైద్య, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆహార పదార్థాల విక్రయదారులందరికీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరు ట్రేడ్ లైసెన్స్ లు తీసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని సూచించారు.
ఆహార భద్రతలో పాటించాల్సిన ముఖ్య అంశాలపై దృష్టి సారించాలని, చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడ వద్దన్నారు. ప్రజలకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులను, కల్తీ లేని ఆహార పదార్థాలు అందించడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ, సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి డా.అబ్దుల్ వకీల్, ఫుడ్ సేఫ్టీ అధికారి మూర్తి రాజ్, ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.