SLBC Tunnel: ‘సొరంగ’ ప్రమాదానికి రాజకీయ ‘విపత్తు’!
ఎస్.ఎల్.బీ.సీ.సొరంగంలో పై కప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుగా మంత్రి ఉత్తమ్ సోమవారం ప్రకటించారు.కానీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురద జల్లడానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేయడానికి బిఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.
- By SK Zakeer Published Date - 03:43 PM, Tue - 25 February 25

ఎస్.ఎల్.బీ.సీ.సొరంగంలో పై కప్పు కూలిన దుర్ఘటనలో 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు.ఇది పూర్తిగా ప్రకృతి విపత్తుగా మంత్రి ఉత్తమ్ సోమవారం ప్రకటించారు.కానీ ఈ ఘటనను ప్రభుత్వంపై బురద జల్లడానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రదిష్టపాల్జేయడానికి బిఆర్ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది.రేవంత్ ప్రభుత్వానికి ‘రాజకీయ విపత్తు’ సృష్టించేందుకు కేటీఆర్,హరీశ్ ప్రయత్నిస్తున్నారు.
సొరంగం పై కప్పు కూలిన చోట చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడడం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.సంఘటనా స్థలిలో పరిస్థితి గంబీరంగా ఉన్నది.కానీ వాటర్ ఫ్లోటింగ్ తో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.వాటర్ ఫ్లోటింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.రంగంలోకి భారత సైనిక బలగాలు కూడా దిగాయి.ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు భారత సైన్యం సాహసోపేతంగా రెస్క్యూ చర్యలు తీసుకుంటుందన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఎన్.డి.ఆర్.ఎఫ్,ఎస్.డి.ఆర్.ఎఫ్ బలగాలను ఆర్మీకన్నా ముందే రంగంలోకి దింపారు.ఇంజినీరింగ్ అధికారులతో పాటు సహాయక చర్యలు చేపట్టిన వారితో ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తోంది.ప్రమాద వార్త తెలిసిన వెంటనే జరిగిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రధాని మోడీ,ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు.తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
”టన్నెల్ ప్రమాద ఘటనను చిల్లర రాజకీయాలు చేయకండి.ఎస్.ఎల్.బి.సి ని బి.ఆర్.ఎస్ పాలకులు చేసిన నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం.ఏ టన్నెల్ నిర్మాణం జరిగినా లీకేజ్ లు సర్వసాధారణం. బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో కుడా ఈ తరహా లీకేజ్ లు ఏర్పడ్డాయి.సొరంగం తవ్వకాల సమయంలో ఏర్పడ్డ లీకేజ్ ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చు.టన్నెల్ ప్రమాద ఘటనలో బి.ఆర్.ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.కమిషన్లు తప్ప ప్రాజెక్ట్ ల నిర్మాణాల గురుంచి పట్టించుకోని వారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది”అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం,ఆర్మీ,నేవీ,నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్,స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తున్నాయి.డీ వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరం ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నారు.సహాయక చర్యలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేస్తోంది.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.టన్నెల్ లోని సహజ రాతి నిర్మాణాలు సడలడంతో అకస్మాత్తుగా నీరు,మట్టి ప్రవహించడంతో ప్రమాదం జరిగినట్టు ప్రాధామికంగా నిర్ధారణకు వస్తున్నారు.దాంతో టన్నెల్ లో దాదాపు ఇరవై అడుగులకు పైగా నీరు నిండిపోయింది.సహాయకచర్యలకు ఆటంకం కలుగుతున్నందున దీనిని పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.
ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం భౌగోళికంగా క్లిష్టమైన ప్రదేశం కావడంతో భారీ యంత్రాలను అక్కడికి చేర్చడం కష్టంగా మారింది. అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా మట్టి దిబ్బలు తొలగించేందుకు కృషి చేస్తున్నారు.నీటిపారుదల శాఖ,విపత్తు నిర్వహణ బృందాలు,రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయి.ప్రమాదం ఫిబ్రవరి 22 వ తేదీ ఉదయం జరగగానే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,మరో మంత్రి జూపల్లి కృష్ణారావు,కొందరు ఉన్నతాధికారులను ఘటనా స్థలానికి పంపించారు.అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయ చర్యల వ్యూహాన్ని సమీక్షించారు.చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి,నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బోజ్జా,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విపత్తు నిర్వహణ బృందాల అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.సహాయకచర్యల పురోగతిని అంచనా వేసి,అవసరమైన సూచనలు అందించారు.మంత్రులు ఆదివారం ఉదయం తిరిగి సంఘటన స్థలానికి చేరుకుని, ఇంజనీరింగ్ అధికారులు,టన్నెల్ ప్రాజెక్టుకు బాధ్యత వహించే కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
.
”ఎస్ఎల్‌బీసీ తవ్వకం జరుగుతున్నప్పుడు శ్రీశైలం నిండినప్పుడల్లా టన్నెల్‌లోకి నీళ్లు వచ్చి ముగిపోతుంటుంది.మళ్లీ వాటిని క్లియర్ చేయాల్సి వస్తుంది.అమ్రాబాద్ ప్రాంతమంతా పులుల అభయారణ్యం.పర్యావరణ సంఘాలు ఇది పర్యావరణ వ్యతిరేకమంటాయి. టన్నెల్‌లోకి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేయటానికి వీలు లేకుండా పెట్టారు.టన్నెల్ రెండు చివర్ల నుంచి వచ్చే గాలి పీల్చుకుంటూనే లోపల కార్మికులు టన్నెల్ తవ్వాల్సి ఉంటుంది.ఇంకెన్ని ఏళ్లకు కంప్లీట్ కావాలి.ఇది ఎవరి పాపం.తెలంగాణ ప్రజలకు ఎందుకీ శిక్ష.సొరంగ తవ్వకంలో బోర్ చేసుకుంటూ వెనుక నుంచి లైనింగ్ చేసుకుంటూ వెళ్తారు.దాన్ని ఒకవేళ వెనక్కి లాగేద్దామంటే వెనుక చేసిన లైనింగ్ అంతా కూల్చేయాల్సిందే.ఇప్పుడు దాన్ని కొనసాగించటం తప్ప,గత్యంతరం లేని భయంకరమైన పరిస్థితిలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు కూరుకుపోయింది”అని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నవేళ 2016 లో అసెంబ్లీలో వివరించారు.ఈ వీడియోను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నది.
2004లోనే డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎస్.ఎల్.బీ.సీ. ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఆ టన్నెల్ పనులు ఆలస్యంగా జరగటంతో 2016 వరకు కూడా పూర్తి కాలేదు.’అది ఒక డేంజరస్ ప్రాజెక్ట్’ అని కేసీఆర్ తెలిపారు. ఇక అప్పటి నుంచి ఆ పనులు కొనసాగలేదు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇటీవలే పనులు మొదలు పెట్టారు. పనులు మొదలుపెట్టిన నాలుగు రోజులకే టన్నెల్ పైకప్పు కూలటంతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.”బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పదేళ్ల పాటు పట్టించుకోలేదు.ఇప్పుడు మాత్రం బాద్యతను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి,పొన్నం ప్రభాకర్ ఎదురుదాడికి దిగారు.
కాగా దక్షిణ తెలంగాణకు కేసీఆర్ హయాంలో తీవ్ర అన్యాయం జరిగిందని,తీరని ద్రోహం చేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రులు ఉత్తమ్,కోమటిరెడ్డి పలుమార్లు ఆరోపించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగం ద్వారా నిండే రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు,డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టీఎంసీలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టీఎంసీలు.ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా కృష్ణా బేసిన్‌లోని వివిధ దశలలో ఉన్న ఇతర ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదు.ఫలితంగా దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ నాయకులంటున్నారు.కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసినట్టు వాళ్ళ ఆరోపణ.కృష్ణా బేసిన్‌లోని కొన్ని ప్రాజెక్ట్‌లలో కాలువలు,డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయాయి. బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి కేసీఆర్,హరీశ్‌రావు ప్రధాన కారణమని కాంగ్రెస్ నాయకులు అఆరోపిస్తున్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటినీ పూర్తిచేయాలని మంత్రులు అనుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ రంగంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు, రూ.1.81 లక్షల కోట్లు వెచ్చించినా కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి.దీంతో నల్గొండ,మహబూబ్‌నగర్ జిల్లాల్లో 103 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం నిరుపయోగంగా ఉంది. ”తెలంగాణకు హక్కుగా ఉన్న కృష్ణా బేసిన్ వాటాను కోల్పోయాం.కేసీఆర్ పాలనలో అవినీతి, దుర్వినియోగంతో రైతులు నష్టపోయారు’’ అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ల నుంచి నీటి లభ్యత ఉన్నా, దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు సగంలో నిలిచిపోయాయి.
గత పాలనలో అతిపెద్ద వైఫల్యాలలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటన్నది కాంగ్రెస్ నాయకుల విమర్శ. అంజనగిరి, వీర్నంపల్లి,వెంకటాద్రి,కురుమూర్తిరాయ,ఉదండాపూర్,కేపీ లక్ష్మీదేవిపల్లి,పోతిరెడ్డిపల్లి,సింగరాజ్‌పల్లి,గొట్టిముకల,యర్రాపల్లి-గోకవరం,డిండి,చింతపల్లి,కిస్తారంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్,శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లను పూర్తిచేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.దక్షిణ తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది.దశాబ్దకాలంగా గత ప్రభుత్వం లో వివక్షకు గురైన ప్రాజెక్ట్ ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.పైగా ప్రాజెక్ట్ ప్రారంభంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,292 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టగా బీఆర్ఎస్‌ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన అంచనాలు రెట్టింపయ్యాయి. ఉద్దేశ్యపురంకంగానే కేసీఆర్ ప్రభుత్వం ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్ట్ పై ఉదాసినత చూపెట్టిందన్న విమర్షలున్నాయి.
పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు నల్లగొండ జిల్లా దేవరకొండ కొండలో ఒక సమీక్ష సమావేశాన్నీ నిర్వహించారు.శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులతో పాటు డిండి ప్రాజెక్ట్, ఉదయ సముద్రం,పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ,బునాదిగాని కాలువల పనులను సమీక్షించారు. 2005 లో అప్పటి ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి ఆమోదంతో రూ. 2,292 కోట్లకు పాలనా అనుమతులు పూర్తి చేసుకుని పనులు మొదలుపెట్టగా 2014 తరువాత ఈ ప్రాజెక్ట్ పనులు అటకెక్కాయి..2005 – 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 1279.04 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన మొత్తాన్ని కలుపుకుంటే ఈ ప్రాజెక్ట్ పై రూ. 2,643.50 కోట్లు ఖర్చు చేశారు.తిరిగి అదే ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనా వ్యయాన్ని రూ. 4,658.89 కోట్లకు పెంచిన ప్రతిపాదనల అనుమతుల కోసం ప్రభుత్వానికి 2023 డిసెంబర్ లో పంపించారు.ఆ తరువాత ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఎస్.ఎల్.బి.సి.టన్నెల్ ప్రముఖంగా చర్చలోకి వచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద సొరంగ మార్గంలో 2017 లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారంలోకి తీసుకువెళ్లలేకపోతోంది.మూడు గుట్టల మధ్య 92 మీటర్ల లోతు, 56 మీటర్ల డయాతో సర్జ్‌పూల్ అనే మహాబావిని,మిడ్ మానేరు నుంచి 3 కిలోమీటర్ల కాలువను,8 కిలోమీటర్ల సొరంగమార్గాన్ని నిర్మించారు. 9.5 మీటర్ల డయాతో రోజూ 11 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేవిధంగా సొరంగమార్గాన్ని నిర్మించారు.దీని ద్వారా రోజు ఒక టీఎంసీ నీరు సర్జ్‌పూల్‌కు,అక్కడి నుంచి మల్లన్న సాగర్‌కు వెళ్తుంది.ప్రతిమ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ సర్జ్‌పూల్, సొరంగమార్గం పనులను చేపట్టింది. సొరంగమార్గంలో పైకప్పు డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో 10 మీటర్ల పొడవు రాయి ఉన్నపళంగా కూలిపోయింది.దీంతో పని స్థలంలో ఉన్న 8 మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకొనిపోయారు.వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.జార్ఖండ్ రాష్ట్రం రాంగఢ్ జిల్లా బార్లేంగా గ్రామానికి చెందిన పురంసింగ్,గడ్‌మా తీవ్రంగా గాయపడ్దారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా పురం సింగ్ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యమంటూ బిఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు,కేటీఆర్ దుమ్మెత్తి పోస్తుండగా కాంగ్రెస్ నాయకులు,వాళ్లకు దీటుగా జవాబివ్వలేకపోతున్నారు.దీంతో ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడినంతగా ప్రధాన ప్రతిపక్షం భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.