MP Chamala Kirankumar Reddy: డల్లాస్‌లో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతిపై ఎంపీ సంతాపం!
"అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా, అక్కడి స్థానిక ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేయాలి" అని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
- By Gopichand Published Date - 02:31 PM, Sun - 5 October 25

MP Chamala Kirankumar Reddy: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో తెలంగాణకు చెందిన యువ విద్యార్థి చంద్రశేఖర్ పోలే మరణించడంపై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి (MP Chamala Kirankumar Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని ఆయన తన ప్రగాఢ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
“ఒక యువ విద్యార్థి విదేశాలలో ఉన్నత విద్యా లక్ష్యాలతో వెళ్లి ఇలాంటి హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం” అని ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుడి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ, వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు.
Also Read: YCP: విశాఖలో వైసీపీ ఉత్తరాంధ్ర సమీక్ష.. ఆ అంశంపై కీలక చర్చ!
ఆయన అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులతో పాటు టీపీసీసీ (TPCC) ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంస్థల ప్రతినిధులు హ్యూస్టన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) సహకారంతో విద్యార్థి మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు చురుగ్గా చేపడుతున్నారు. ఈ దారుణ సంఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మృతదేహం తరలింపు ప్రక్రియలో దౌత్య సహాయం అందించేలా తాను కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
“అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా, అక్కడి స్థానిక ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయాలు సమన్వయంతో పనిచేయాలి” అని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఆయన కోరారు.