Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
- By Latha Suma Published Date - 03:29 PM, Wed - 27 August 25

Heavy rains : వాయవ్య బంగాళాఖాతంలో, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంగా కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడింది. ఇది ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Also: Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
ఈరోజు మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో వర్షాల ముప్పు ఉండటంతో అక్కడ ఎల్లో హెచ్చరికలు అమలులో ఉన్నాయి. బుధవారం కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షం విషాదానికి దారి తీసింది. తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. తక్షణమే వారు సమీపంలో ఉన్న డీసీఎం వాహనంలోని వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.
కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీటిమునిగింది. పోలీసులు రంగంలోకి దిగుతూ 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల తీవ్రత రైలు మార్గాలపై కూడా ప్రభావం చూపింది. కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైల్వే పట్టాల కింద మట్టి కోతకు గురైంది. పలుచోట్ల ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలోని రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేస్తూ కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరో నాలుగు రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై మళ్లించబడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వరుసగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.