Medaram-Samakka : గద్దె మీదకు చేరుకున్న సమ్మక్క
- By Sudheer Published Date - 11:20 PM, Thu - 22 February 24

మేడారం (Medaram) జాతరలో అతి కీలకమైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. లక్షలాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూనకాలు, గిరిజన యువతుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ సమ్మక్క (Samakka ) మేడారం గద్దెల (Reaches to Gadde)పై కొలువుదీరింది. చిలకలగుట్ట నుంచి వనం వీడి జనం మధ్యలోకి వచ్చారు. ఆమె రాకతో భక్తుల నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగాయి. గాల్లోకి కాల్పులు జరిపి ఎస్పీ శబరీష్ అధికారికంగా స్వాగతం పలికారు. రెండేళ్లకోసారి జరిగే ఆదివాసీ జన జాతరలో అశేష జనవాహినితో కొత్త శోభను సంతరించుకుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తులకు అభయమిస్తున్నారు. ఇక ఇప్పుడు సమ్మక్క కూడా భక్తులకు దర్శనం ఇస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలయ్యింది. ముందుగా వడ్డెలు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు ) తీసుకొచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క పూజామందిరంలోని అడేరాలు (కొత్తకుండలు ) తీసుకొచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం చిలుకలగుట్టకు వెళ్లి ప్రధాని పూజారితో కలిసి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని మేడారం బయల్దేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాల ప్రకారం ఎస్పీ పి.శబరీశ్ ఏకే-47 తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట నుంచి పోలీసుల బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు.
Read Also : Condom Politics: ఆంధ్రప్రదేశ్‌లో కండోమ్ రాజకీయం