Rythu Runa Mafi: రైతులకు శుభవార్త.. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కార్యాచరణ
- By Latha Suma Published Date - 12:22 PM, Tue - 13 February 24

Rythu Runamafi : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇవ్వగా విడతల వారీగా చెల్లింపులు చేస్తూ వచ్చింది. దశలవారీగా రుణమాఫీ చేస్తుండటంపై అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల వరకు ఒకేసారి రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వటంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది.
రాష్ట్రంలోని రైతులు తీసుకున్న పంట రుణాలు 20 వేల కోట్లు నుంచి 25 వేల కోట్లు రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆ మొత్తాన్ని పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసేందుకు సిద్దపడింది. రైతులు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు హామీ ఇస్తుంది. దీంతో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు రుణ విముక్తి కలగనుంది. ఉదాహరణకి రూ.25 వేల కోట్లకు బ్యాంకర్లకు ప్రభుత్వం హామీ ఇచినట్లైతే ఆ మొత్తాన్ని 50 నెలల పాటు ప్రతి నెల రూ. 500 కోట్లు వడ్డీతో కలిపి ప్రతి నెల రూ. 550 కోట్లు నుంచి రూ.600 కోట్లు చెల్లిస్తే అప్పు తీరుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అధికారం చేపట్టిన మరుక్షణమే ఆర్ధిక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సమీక్షలు మొదలు పెట్టి రాష్ట్ర ఆర్థిక వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉండేవి బీఆఎర్ఎస్ అధికారం చేపట్టాక పదేళ్ల పరిపాలనలో ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం పంట పెట్టుబడి సాయం పైసలు వెంటనే రైతుల ఖాతాల్లో వెయ్యాలని సీఎం అధికారులను ఆదేశించారు. గతంలో వరంగల్ ‘రైతు సంఘర్షణ’ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
READ ALSO :AIMIM: బీహార్‌లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత