Telangana Budget 2025-26 : AI సిటీ కోసం రూ.774 కోట్లు – భట్టి
Telangana Budget 2025-26 : ఫ్యూచర్ సిటీలో భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా AI సిటీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ) ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు
- Author : Sudheer
Date : 19-03-2025 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం 2025-26 బడ్జెట్(Telangana Budget 2025-26)లో కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ యుగానికి అనుగుణంగా, హైదరాబాద్‌ను టెక్నాలజీ కేంద్రంగా మార్చే దిశగా అడుగులు వేయబోతుంది. ఫ్యూచర్ సిటీలో భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా AI సిటీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ) ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల కేంద్రంగా ఈ ఏఐ సిటీ (AICITY) మారనుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గూగుల్ తన AI ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు బడ్జెట్‌లో రూ. 774 కోట్లు కేటాయించారు. కృత్రిమ మేథ, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణను టెక్నాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయబోతున్నట్లు పేర్కొన్నారు.
Telangana Budget 2025-26: సామాన్యులకు తీపి కబురు.. ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఫ్యూచర్ సిటీ పేరుతో నాల్గవ ఐటీ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టును 765 చ.కి.మీ. విస్తీర్ణంలో శ్రీశైలం-నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో అభివృద్ధి చేయనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత నగరాలతో పోటీ పడేలా, కాలుష్యరహితంగా, అత్యంత ఆధునికంగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. మెట్రో రైలు విస్తరణ, మల్టీ మోడల్ కనెక్టివిటీ, గ్రీన్ బిల్డింగ్స్, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి ఆధునిక సదుపాయాలతో నగరం అభివృద్ధి చెందనుందని , ఫ్యూచర్ సిటీలో భాగంగా AI సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పథకం ద్వారా 19 ప్రధాన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగు రోడ్ నిర్మాణం, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, మాదకద్రవ్యాల నిరోధక వ్యూహం అమలు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా వీటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ఉంది. AI సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు తెలంగాణను దేశంలోనే కాదు, ప్రపంచస్థాయిలో ఒక ప్రధాన టెక్నాలజీ కేంద్రంగా మార్చే అవకాశం ఉందని అర్థం అవుతోంది.