42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్
42% quota for BCs : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జీవో నంబర్ 9 విడుదల కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే దశలో ఉంది
- By Sudheer Published Date - 08:35 PM, Fri - 26 September 25

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు (BC) 42 శాతం రిజర్వేషన్ (42% quota for BCs) కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జీవో నంబర్ 9 విడుదల కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే దశలో ఉంది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించడంతో, ఈ నిర్ణయం అత్యవసరంగా మారింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వెనుక సమగ్ర నివేదికలు, కుల సర్వే, డెడికేటెడ్ BC కమిషన్ సిఫార్సులు ఆధారమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 42% BC రిజర్వేషన్‌లో మహిళలకు 50% సబ్-కోటా ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులలో మహిళా నాయకత్వం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌ను సీల్డ్ కవర్లలో పంచాయతీ రాజ్ శాఖకు పంపించారు. ఈ ప్రకారం స్థానిక సంస్థల స్థాయిలో BC, SC, ST రిజర్వేషన్లు ఖరారవుతాయి.
అయితే ఈ నిర్ణయం చట్టపరంగా ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటుందన్నది ఇంకా అనిశ్చితంగానే ఉంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదనే పరిమితి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన బిల్లుల ప్రకారం SC, ST, BCలకు కలిపి 50% మించి రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. ఈ జీవోపై ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఒకవైపు వేగంగా సాగుతున్నా, చట్టపరమైన సవాళ్లు మరోవైపు ఈ నిర్ణయాన్ని పరీక్షించనున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Reservation of 42% of seats and positions in Local bodies for BCs in Telangana State#Telangana #LocalBodyElections pic.twitter.com/dTKmseiqZB
— Congress for Telangana (@Congress4TS) September 26, 2025