Revanth Reddy vs KTR: కేటీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి..!
- By HashtagU Desk Published Date - 04:32 PM, Wed - 30 March 22

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం యాసంగి వడ్లు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి వడ్లు కొనాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం పై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా గులాబీ నేతలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీంతో ఒకవైపు బీజేపీ సర్కార్ పై టీఆర్ఎస్ నేతలు ఓ రేంజ్‌లో విమర్శలు కురిపిస్తుండగా, మరోవైపు రైతులను మోసం చేస్తూ డ్రామాలు ఆడుతున్న అధికార పార్టీ నేతల పై ప్రతిపక్ష నాయకులు ఫైర్ అవుతున్నారు. అధికార – ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలో తాజాగా తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్వీట్‌తో, వడ్ల రాజకీయం పీక్స్‌కు చేరుకుంది.
రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లు కొనుగోలు విషయంలో, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి రైతులను మోస్తూ, రాజకీయం చేస్తున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేయగా, అందుకు టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ల పాటు అధికారం ఇస్తే అధికారంలో ఉన్న కాలంలో రైతులకు కనీసం ఆరు గంటల విద్యుత్ ఇవ్వలేకపోయారని, తద్వారా రైతులు క్షోభతో ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్ కౌంటర్ పై తాజాగా స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి, కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిబద్దతత గురించి కేటీఆర్‌కు తెలియకపోవడం పట్ల జాలి వేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీ తండ్రి కేసీఆర్‌ని అడిగితే తెలుస్తుందని, కానీ ఆయన రైతుల సమస్యలను రాజకీయం చేయడంలో బిజీగా ఉండొచ్చని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇప్పటి వరకు దాదాపు 7వేల పైచిలుకు మంది రైతులను పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం ద్వారా 4 కోట్ల ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ఇక రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తీసుకొచ్చామన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆర్టీఈ, ఆర్టీఐ చట్టాలను కూడా తీసుకొచ్చిందని, తద్వారా మీలాంటి ప్రభుత్వాలను ప్రజలు జవాబుదారీగా ఉంచగలుగుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్‌లో సంఘీభావం తెలపకుండా, పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా నిలవాలని రాహుల్‌ని కవిత కోరారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో పోరాటం చేయట్లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి తెలంగాణ వడ్ల కొనుగోలు పాలిటిక్స్ ఎంత దూరం వెళుతుందో చూడాలి.