Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఫలితం పై రేవంత్ కట్టుదిట్టం..
Jubilee Hills By-Election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కిన చర్చగా మారింది. ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి
- By Sudheer Published Date - 11:14 AM, Mon - 3 November 25
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడెక్కిన చర్చగా మారింది. ఈ ఉపఎన్నికను మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ గౌరవంతో ముడిపడిన ఎన్నికగా భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫలితం ప్రభుత్వ భవిష్యత్తుపై, మంత్రుల పనితీరుపై నేరుగా ప్రభావం చూపుతుందని స్పష్టంగా తెలిపారు. “జూబ్లీహిల్స్ గెలుపు మనదే అవ్వాలి” అని మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కూడా ఈ ఎన్నికపై సీరియస్‌గా వ్యవహరిస్తోందని, ఎవరి పనితీరు ఎలా ఉందన్నది పర్యవేక్షిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Shani: శని ప్రభావం వద్దని అనుకుంటున్నారా.. అయితే అదృష్టాన్ని కాలదన్నుకున్నట్లే!
సీఎం రేవంత్ తన నివాసంలో నిర్వహించిన విందు సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, పలు మంత్రులు హాజరయ్యారు. రేవంత్ మాట్లాడుతూ ఈ ఉపఎన్నికను సొంత ఎన్నికలాగానే తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరేలా ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం, తప్పుడు సర్వేలను ప్రజలు నమ్మేలా ప్రయత్నిస్తున్నారని, వాటిని బలంగా తిప్పికొట్టాలని మంత్రి, ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ ఎన్నికలో ప్రతి ఓటు ప్రాధాన్యమైందని, ఎవరికీ నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
పోల్ మేనేజ్‌మెంట్, బూత్ స్థాయి సమన్వయంపై కూడా సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక బూత్ ఏజెంట్‌ను నియమించి పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. ప్రచారం సమర్థవంతంగా జరిగేలా జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ను కో-చైర్మన్‌గా నియమిస్తూ, మరో 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రచార షెడ్యూల్ నుంచి బూత్ స్థాయి కార్యకలాపాల దాకా బాధ్యతలు వహిస్తుంది. కాంగ్రెస్ గెలుపే లక్ష్యమని, ఈ విజయంతో రాష్ట్రంలో పార్టీ బలం మరింత పెరుగుతుందని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే కాకుండా, రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిష్ఠకు కూడా పరీక్షగా నిలవనుంది.