Station Ghanpur: కడియంకు రాజయ్య సహకరిస్తాడా?
కొంతకాలంగా స్టేషన్ ఘన్‌పూర్ వివాదం అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య రాజకీయ రగడ చోటు చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 02:36 PM, Wed - 23 August 23

Station Ghanpur: కొంతకాలంగా స్టేషన్ ఘన్‌పూర్ వివాదం అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య రాజకీయ రగడ చోటు చేసుకుంది. నా ఏరియాలో నీకేం పనేంటని ఇరువురు మాటామాటా అనుకున్నారు. చివరికి ఈ వివాదం ప్రగతి భవన్ కు చేరింది. దీంతో రాజయ్యను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. ఇదిలా ఉండగా 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ మేరకు సీఎం కెసిఆర్ తన పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కడియంకు టికెట్ కేటాయించిన కేసీఆర్ రాజయ్యను పక్కనపెట్టేశారు. దీంతో రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ వెంటే ఉంటానని శపధం చేశాడు. కాగా స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామని కడియం శ్రీహరి అన్నారు.
కడియం శ్రీహరి బుధవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు రాజకీయం, ఓట్లకోసం మతిలేని, నీతిలేని రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్ ఘన్పూర్ లో గులాబీ జెండా ఎగురవేస్తామని కడియం అన్నారు. అయితే మీకు రాజయ్య సహకరిస్తారా అని జర్నలిస్టు అడగగా.. కేసీఆర్ నిర్ణయానికి రాజయ్య కట్టుబడి ఉంటానని చెప్పాడని కడియం అన్నారు. అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని కడియం ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Chandrayaan 3 : విక్రమ్ ల్యాండర్ గా మారిన స్విగ్గీ డెలివరీ ఐకాన్..