MLC By Elections : రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ కుట్ర.. ఈసీకి రఘునందన్ కంప్లయింట్
బీఆర్ఎస్పై మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు.
- Author : Pasha
Date : 26-05-2024 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
MLC By Elections : బీఆర్ఎస్పై మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సంచలన ఆరోపణ చేశారు. వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ఆయన ఆరోపించారు. డబ్బులు పంచి గెలవాలని ఆ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. వెంటనే బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు కొనాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలని ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు రఘునందన్‌రావు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదును పంపారు.
We’re now on WhatsApp. Click to Join
ఓ బ్యాంక్‌లోని బీఆర్ఎస్ పార్టీ అకౌంటు నుంచి 30 మంది ఎన్నికల ఇన్‌ఛార్జులకు కోటి చొప్పున డబ్బును పంపాలని బీఆర్ఎస్ భావిస్తోందని రఘునందన్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఈసీకి అందించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరారు. డబ్బు ద్వారా ఎమ్మెల్సీ బైపోల్‌లో గెలవాలని బీఆర్ఎస్ పార్టీ భావించడం ఆందోళనకరమన్నారు.
Also Read :Swati Maliwal : అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మలివాల్
రేపు (సోమవారం రోజు) వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది సెక్టోరియల్ అధికారులు, 39 మంది ప్రిసైడింగ్ అధికారులు, 137 మంది పోలింగ్ సిబ్బంది, 40 మంది సూక్ష్మ పరిశీలకులు విధులు నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు.