Harish Rao: ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి: హరీష్ రావు
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు.
- By Gopichand Published Date - 02:43 PM, Mon - 25 August 25

Harish Rao: ఆశా కార్యకర్తలకు స్థిర వేతనం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తలు నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. “ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మాట తప్పి, వారిని రోడ్డు మీదకు రప్పించారు. ఇది దుర్మార్గం” అని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు పిలుస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పడం సరికాదని హరీష్ రావు అన్నారు. “హైదరాబాద్ వాటర్ బోర్డ్‌లో రూ. 4000 కోట్లు, హెచ్‌ఎండీఏలో రూ. 10,000 కోట్లు, జీహెచ్‌ఎంసీలో రూ. 6000 కోట్లు, ఇరిగేషన్ శాఖలో రూ. 10,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. ఈ కాంట్రాక్టుల కోసం డబ్బులు ఉన్నాయి కానీ, పేద ప్రజలకు సేవ చేసే ఆశా కార్యకర్తలకు జీతాలు ఇవ్వడానికి మాత్రం నిధులు లేవా? ఈ రూ. 50 వేల కోట్ల కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చాయి రేవంత్ రెడ్డి?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read: India-Pak : పాకిస్థాన్‌కు భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
అసెంబ్లీని స్తంభింపజేసి అయినా పోరాడుతాం
ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. “మీ హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం” అని హామీ ఇచ్చారు.
ఇతర ప్రధాన అంశాలు
కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన ఆశా వర్కర్ల సేవలను కేసీఆర్ ప్రభుత్వం గౌరవించిందని, ఆనాడు రూ. 2,200 ఉన్న జీతాన్ని రూ. 10,000కు పెంచామని హరీష్ రావు గుర్తు చేశారు. గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, గ్రామ పంచాయతీలకు శానిటేషన్ నిధులు, ట్రాక్టర్లకు డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు సేవలు నిలిపివేసే పరిస్థితి వస్తుందని హరీష్ రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పనులకు రిబ్బన్లు కత్తిరించడానికి మాత్రమే తిరుగుతున్నారని, కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేదని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, గురుకులాల బిల్లులు, డీఏ, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వంటి అనేక హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని హరీష్ రావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపు ఆశా కార్యకర్తలను పిలిపించి మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఆశా కార్యకర్తలు తమ సత్తా ఏమిటో చూపిస్తారని హెచ్చరించారు.