Praja Vijaya Utsavalu : నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు ప్రజా విజయోత్సవాలు : భట్టి
చివరి రోజైన డిసెంబరు 9 న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు(Praja Vijaya Utsavalu) జరుగుతాయి
- By Pasha Published Date - 03:25 PM, Sat - 9 November 24

Praja Vijaya Utsavalu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు 26 రోజుల పాటు ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈవివరాలను ఇవాళ మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజా విజయోత్సవాల నిర్వహణపై భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇందులో భాగంగా 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తాం. చివరి రోజైన డిసెంబరు 9 న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు(Praja Vijaya Utsavalu) జరుగుతాయి’’ అని తెలిపారు.
Also Read :Putin : ‘సెక్స్ మంత్రిత్వ శాఖ’.. శోభనానికి, డేటింగ్‌కు ఆర్థికసాయం ! ?
ప్రజా విజయోత్సవాలకు సంబంధించిన కార్యక్రమంలోనే తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ‘‘తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన లాంటి కార్యక్రమాలన్నీ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జరగబోతున్నాయి’’ అని భట్టి విక్రమార్క వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారన్నారు.
Also Read :Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద
ప్రజా విజయోత్సవాలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజన్‌ను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ఏడాది వ్యవధిలో సీఎం రేవంత్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ‘‘ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న స్కీంలపై ప్రచారం చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాల వల్ల ప్రజలకు కలుగుతున్న లబ్ధిని వివరిస్తాం’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.‘‘మా ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. మహిళా సంఘాలకు 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేసింది. ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తాం’’ అని ఆయన వివరించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.