Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద
నికర సంపద పరంగా ఎలాన్ మస్క్(Elon Musk) తర్వాతి స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు.
- By Pasha Published Date - 01:37 PM, Sat - 9 November 24

Elon Musk : అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన నికర సంపద విలువ దాదాపు రూ.25 లక్షల కోట్లు. ఈవిషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది. మస్క్ సంపద ఇంత భారీ రేంజుకు చేరడం అనేది గత మూడేళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2022 జనవరిలో మస్క్ సంపద ఈ రేంజుకు చేరింది. ఆ తర్వాత క్రమంగా దాని విలువ తగ్గుతూపోయింది. ఇప్పుడు మళ్లీ అదే రేంజును టచ్ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన కొన్ని రోజుల్లోనే.. మస్క్ సంపద ఇంతలా పెరిగిపోవడం గమనార్హం. ఇప్పుడు అకస్మాత్తుగా మస్క్ సంపద రూ.25 లక్షల కోట్లకు పెరగడానికి ప్రధాన కారణం.. ఆయన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్ల ధరలు 28 శాతం మేర పెరిగాయి. రానున్న రోజుల్లో టెస్లా కంపెనీకి అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు ఉంటాయనే ప్రచారంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Also Read : Seaplane : ఫ్యూచర్‌లో ఏ యిజం ఉండదు.. టూరిజం ఒక్కటే ఉంటుంది : సీఎం చంద్రబాబు
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. నికర సంపద పరంగా ఎలాన్ మస్క్(Elon Musk) తర్వాతి స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన వద్ద దాదాపు రూ.19 లక్షల కోట్ల సంపద ఉంది. ఇక ఫేస్ బుక్, వాట్సాప్ కంపెనీల అధినేత మార్క్ జుకర్‌బర్గ్ వద్ద దాదాపు రూ.17 లక్షల కోట్ల సంపద ఉంది.
Also Read :GPS Attack : దక్షిణ కొరియాపై ‘జీపీఎస్’ ఎటాక్.. ఉత్తర కొరియా ఘాతుకం
ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు మస్క్ బహిరంగంగానే సపోర్ట్ చేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వేల కోట్లు విరాళంగా మస్క్ అందజేశారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక.. ఎలాన్ మస్క్‌కు ప్రభుత్వంలో కీలక పదవిని కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో వీడియో కాల్‌లో మాట్లాడిన ట్రంప్.. ఎలాన్ మస్క్‌ను కూడా ఆ కాల్‌లోకి కాన్ఫరెన్స్ ద్వారా యాడ్ చేశారు. రానున్న రోజుల్లో ట్రంప్ ప్రభుత్వంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారానికి ఈ పరిణామం మరింత బలమిచ్చింది.