Ponguleti : త్వరలోనే నాపై ఐటీ రైడ్స్.. బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : పొంగులేటి
Ponguleti : వచ్చే రెండు, మూడు రోజుల్లో తనపై ఐటీ రైడ్స్ జరగొచ్చని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- Author : Pasha
Date : 07-11-2023 - 3:23 IST
Published By : Hashtagu Telugu Desk
Ponguleti : వచ్చే రెండు, మూడు రోజుల్లో తనపై ఐటీ రైడ్స్ జరగొచ్చని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ నేతలపై ఐడీ రైడ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా నాపై ఐటీ రైడ్స్ చేస్తే ఓకే.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెడితే కోర్టును ఆశ్రయిస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను ఎన్నడూ తప్పు చేయలేదు. తప్పు చేయబోను’’ అని తేల్చి చెప్పారు.‘‘నాతో పాటు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కేటీఆర్ టార్గెట్ చేయబోతున్నారు. కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకులను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ వందల కోట్లను ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చేరవేసింది’’ అని పొంగులేటి ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమంగా కాజేసిన రూ.లక్ష కోట్లతో ఈ ఎన్నికల్లో గెలవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అయితే గెలుపు అంత ఈజీ కాదని తెలియబట్టే.. బీజేపీ సర్కార్ తో కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ రైడ్స్ చేయిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉన్నానని, ఇక్కడి సీట్లన్నీ కాంగ్రెస్, వామపక్షాలే గెల్చుకుంటాయని పొంగులేటి విశ్వాసం వ్యక్తం చేశారు. 72 నుంచి 78 సీట్లతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు (Ponguleti) ఏర్పాటు ఖాయమన్నారు.