Maoists Movement: ఆదిలాబాద్ అడవుల్లో మావోయిస్టుల కదలికలు!
ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.
- By Balu J Published Date - 05:07 PM, Thu - 1 September 22

ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు మండలాల్లోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు వారం రోజుల క్రితం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గ్రెనేడ్ లభించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. ఈ క్రమంలో మావోయిస్టుల అనుమానాస్పద కదలికలను గుర్తించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు తెలుస్తోంది. 2020 సెప్టెంబరులో కదంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని, మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని ఛత్తీస్‌గఢ్ అడవులకు వెళ్లారని పోలీసులు అప్పట్లో ప్రకటించారు.
మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, భాస్కర్ దళంలోని 10 మంది మావోయిస్టులపై పోలీసులు 95 లక్షల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల మావోయిస్టుల కదలికలతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహాయం చేయవద్దని, మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అటూ మావోయిస్టుల కదలికలు, ఇటు పోలీసుల కూంబింగ్ తో ట్రైబల్ ప్రాంతాలు భయపడిపోతున్నాయి.