T-SAT: టి-సాట్‌ను సందర్శించిన ఓయూ వీసీ!
ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రతీ ఇంటికి చేర్చే లక్ష్యంతో టి-సాట్ (తెలంగాణ స్టేట్ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
- By Gopichand Published Date - 06:36 PM, Fri - 16 May 25

T-SAT: ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రతీ ఇంటికి చేర్చే లక్ష్యంతో టి-సాట్ (T-SAT) (తెలంగాణ స్టేట్ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్)తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డి ప్రొ. జితేందర్ కుమార్ నాయక్, యూజీసీ అఫైర్స్ డీన్ ప్రొ. లావణ్య, ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి తదితరులతో కలిసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోని టి-సాట్ స్టూడియోను సందర్శించారు.
వీసీ ప్రొ. కుమార్ మొలుగరం టి-సాట్‌లోని అధునాతన సాంకేతిక సౌకర్యాలను పరిశీలించారు. స్టూడియోలు, కెమెరాలు, డిజిటల్ బోర్డులు, పోస్ట్-ప్రొడక్షన్ యూనిట్‌లను స్వయంగా తనిఖీ చేసి, టి-సాట్ అత్యుత్తమ సాంకేతికతను ప్రశంసించారు. గతంలో కుదిరిన ఎంఓయూ ఆధారంగా టి-సాట్‌తో మరింత విసృతంగా సహకరిస్తామని ఆయన తెలిపారు. “టి-సాట్ ద్వారా డిజిటల్, ఆన్‌లైన్, శాటిలైట్ మాధ్యమాలలో నాణ్యమైన విద్యా కంటెంట్‌ను అందించే ఏకైక ఛానల్ ఇది. ఓయూ నిపుణులతో కలిసి విద్యార్థులకు ఉన్నత విద్యా కార్యక్రమాలను రూపొందిస్తాం,” అని ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యధిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Also Read: Immigrant Remittances: అమెరికాలోని NRIలకు భారీ షాక్.. ఇకపై బదిలీలపై 5 శాతం పన్ను!
టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మూడవ తరగతి నుండి పీజీ వరకు అకడమిక్ కంటెంట్, కానిస్టేబుల్ నుండి గ్రూప్స్ వరకు పోటీ పరీక్షల కోసం సమగ్ర కంటెంట్‌ను అందిస్తున్నాం. ఓయూ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలతో ఎంఓయూ ద్వారా మరింత ఉన్నతమైన కంటెంట్‌ను సిద్ధం చేస్తాం” అన్నారు. టి-సాట్ స్టూడియో సందర్శనకు వచ్చిన ఓయూ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇతర విశ్వవిద్యాలయాలను కూడా సహకారానికి ఆహ్వానిస్తామని చెప్పారు. టి-సాట్, సాఫ్ట్‌నెట్ ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా సాంకేతికతను వినూత్నంగా వినియోగిస్తూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఈ సందర్శన ఓయూ, టి-సాట్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.