Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!
దరఖాస్తు ఫారాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ (DPO), డిప్యూటీ కమిషనర్ లేదా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
- By Gopichand Published Date - 07:28 PM, Thu - 25 September 25

Liquor Shops: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల (Liquor Shops) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు లైసెన్స్‌ల కోసం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 26, 2025 నుండి అక్టోబర్ 18, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం- రిజర్వేషన్లు
- ప్రతి దరఖాస్తుకు రుసుము రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ (DD) లేదా చలాన్ రూపంలో చెల్లించి రసీదును దరఖాస్తు ఫారంతో జత చేయాలి.
- ఒక వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
- ఈ 2,620 దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించారు. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
- రిజర్వేషన్ కింద దరఖాస్తు చేసుకునేవారు కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కుల ధృవీకరణ పత్రం గడువులోగా అందకపోతే నవంబర్ 15 వరకు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. అయితే దీనికి అండర్‌టేకింగ్ పత్రాన్ని జతచేయాలి.
Also Read: Dussehra Holidays: అంగన్‌వాడీ కేంద్రాలకు తొలిసారి దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం!
దరఖాస్తు సమర్పణ- ఎంపిక ప్రక్రియ
- దరఖాస్తు ఫారాలను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ (DPO), డిప్యూటీ కమిషనర్ లేదా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
- డిమాండ్ డ్రాఫ్ట్‌లను డీపీఓ పేరు మీద తీయాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను రిజిస్టర్ పోస్ట్ లేదా మెయిల్ ద్వారా పంపితే స్వీకరించరు. దరఖాస్తు సమర్పించిన వారికి వెంటనే రసీదుతో పాటు, లాటరీలో పాల్గొనేందుకు అవసరమైన ఎంట్రీ పాస్‌ను అందజేస్తారు.
- మద్యం దుకాణాల ఎంపిక అక్టోబర్ 23, 2025న లాటరీ పద్ధతిలో జరుగుతుంది.
- మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేవారికి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఎక్సైజ్ శాఖ సూచించింది.