NTR Garden : ఎన్టీఆర్ గార్డెన్ కు కేసీఆర్ సర్కార్ ముసలం
స్వర్గీయ ఎన్టీఆర్ అంటే తెలంగాణ సీఎంకు గౌరవం. ఆయన కుమారుడికి తారక రాముని పేరు పెట్టుకున్నాడని చాలా మంది చెబుతుంటారు.
- By CS Rao Published Date - 01:12 PM, Tue - 21 June 22

స్వర్గీయ ఎన్టీఆర్ అంటే తెలంగాణ సీఎంకు గౌరవం. ఆయన కుమారుడికి తారక రాముని పేరు పెట్టుకున్నాడని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ పేరును ఎన్టీఆర్ గార్డెన్ కు తొలిగించే ధైర్యం కేసీఆర్ సర్కార్ చేస్తోంది. ఆ మేరకు కసరత్తు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ గార్డెన్ కు బదులుగా డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పార్క్ గా మార్చడానికి ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. పక్కన ఉన్న లుంబినీ పార్కుకు తెలంగాణ అమరవీరుల స్మారక పార్కుగా నామకరణం చేయాలని నిర్ణయించారని సమాచారం.
వివాదం రాకుండా ఎన్టీఆర్ గార్డెన్‌కు మరో పేరును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎన్టీఆర్-అంబేద్కర్ పార్క్ గా నామకరణం చేయాలని భావిస్తోందట. లుంబినీ పార్కు పక్కనే ప్రత్యేక అమరవీరుల స్మారక మ్యూజియం రాబోతోంది. ఎన్టీఆర్ గార్డెన్‌లో 11 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం నిర్మితం అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అవుతుందని అధికారులు చెబుతున్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు ధ్యాన కేంద్రం, ఫొటో గ్యాలరీ, సమావేశ మందిరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు వెచ్చించడానికి తెలంగాణ సర్కార్ సిద్దం అయింది.
లుంబినీ పార్క్ , ఎన్టీఆర్ గార్డెన్ లను కొత్త సెక్రటేరియట్ భవనం ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని HMDA తాజాగా నిర్ణయించింది. బుధవారం ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించడానికి కన్సల్టెంట్‌లను ఆహ్వానించింది. ఏజెన్సీ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌లను నియమించుకుంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన పర్యాటకుల రద్దీకి అనుగుణంగా ఈ రెండు పార్కులను రీ మోడల్ చేస్తున్నారు. అదే సమయంలో పేర్లను కూడా మార్చేస్తున్నారని టాక్.
పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, ఇందిరాపార్కులను కలుపుతూ ప్రతిపాదిత రోప్‌వేకు ప్రవేశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. 20 ఏళ్లుగా పార్కుల పునరుద్ధరణ జరగలేదని, వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోవిడ్ ఉన్నప్పటికీ గత మూడేళ్లలో హుస్సేన్‌సాగర్ సుమారు 20 లక్షల మందికిపైగా సందర్శకులు వచ్చారని అధికారులు తెలిపారు. HMDA, ట్యాంక్ బండ్‌పై ఆధునిక పాదచారుల నడక మార్గం, అలంకారమైన వీధి దీపాలు, రెయిలింగ్‌లు, గెజిబోలు మరియు ఇతర సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలను పునఃరూపకల్పన చేసింది. పునరుద్దరణ పనులు బాగున్నా, రెండు పార్కుల పేర్లను మార్చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడాన్ని ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ ఏమి చేస్తుందో చూడాలి.