Murder : హైదరాబాద్లో వ్యక్తి దారుణ హత్య.. రెండు బ్యాగుల్లో అవయవాలు
హైదరాబాద్ లంగర్ హౌజ్ దర్గా సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం ముక్కలు
- By Prasad Published Date - 08:52 AM, Fri - 12 May 23

హైదరాబాద్ లంగర్ హౌజ్ దర్గా సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. గురువారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం ముక్కలు ముక్కలుగా నరికి కనిపించడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. శరీర భాగాలను రెండు బ్యాగుల్లో నింపి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని ముక్కలుగా నరికి లంగర్ హౌజ్ దర్గా సమీపంలో పడేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి బ్యాగులను పడేసి పారిపోయారని శరీర భాగాలను గుర్తించిన వారిలో కొందరు పోలీసులకు తెలిపారు. ఆ ప్రాంతం నుండి రక్తం, దుర్వాసన వెదజల్లడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలియగానే లంగర్ హౌజ్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీనియర్ పోలీసు అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, హైదరాబాద్ పోలీసుల క్లూస్ టీమ్‌లతో పాటు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.