MMTS రైలులో అత్యాచారయత్నం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఎవరు చెప్పేది నిజం..?
రైలులో రీల్స్ చేసుకుంటూ యువతి కిందపడిపోయిందని రైల్వే పోలీసులు కేసు క్లోజ్ చేయడం పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
- By News Desk Published Date - 10:38 PM, Fri - 18 April 25

MMTS Train Incident: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 22న ఎంఎంటీఎస్ రైలులో తనపై అత్యాచారయత్నం జరిగిదంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో దాదాపు 250 సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.. వంద మందికిపైగా అనుమానితులను ప్రశ్నించారు. కానీ, ఎక్కడా కూడా ఎలాంటి ఆధారం దొరకలేదు. చివరకు యువతిని ప్రశ్నించగా.. అసలు విషయం ఒప్పుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ట్రైన్‌లో రీల్స్ చేస్తున్న సమయంలోనే జారిపడినట్టు యువతి ఒప్పుకుందని, లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులు తీరుపై యువతి స్పందించింది.
Also Read: Aadhaar: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆధార్ ఇబ్బందులు.. ఉచిత ప్రయాణంపై ఎఫెక్ట్
రైలులో రీల్స్ చేసుకుంటూ యువతి కిందపడిపోయిందని రైల్వే పోలీసులు కేసు క్లోజ్ చేయడం పట్ల బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్విగ్గీ కంపెనీలో పని చేస్తున్నానని, మొబైల్ రిపేర్ నిమిత్తం మేడ్చల్ నుండి సికింద్రాబాద్ కు రైలులో వెళ్లే సమయంలో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఏం చేయాలో తెలియక రైలులో నుండి దూకినట్లు బాధితురాలు పేర్కొంది. గాయాలతో ఉన్న తనను స్థానికులు యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. తాను ఎటువంటి రీల్స్ తీయలేదు. పోలీసులు దర్యాప్తు చేయకుండా కేసు కొట్టివేయడం అన్యాయం అని బాదితురాలు పేర్కొంది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని బాధితురాలు తెలిపింది.
Also Read: Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
అసలేం జరిగిందంటే..?
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి స్విగ్గీలో పనిచేస్తూ మేడ్చల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. మార్చి 22న సెల్‌ఫోర్ రిపేర్ కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన యువతి తిరిగి రాత్రి సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఎక్కింది. అల్వాల్ స్టేషన్ సమీపంలో గాయాలతో ఉన్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని యువతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న తనపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడని, దీంతో భయంతో కదులుతున్న రైలులో నుంచి బయటకు దూకినట్లు చెప్పింది.
యువతి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో యువతిపై అత్యాచారయత్నం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు చివరకు యువతిని ప్రశ్నించగా తనపై అత్యాచారం జరగలేదని, రీల్స్ చేస్తూ కిందపడ్డానంటూ బాధితురాలు తెలిపిందని, దీంతో ఆమెను మందలించి కేసును క్లోజ్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు క్లోజ్ చేయడాన్ని బాధితురాలు తీవ్రంగా తప్పుబట్టింది. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానంటూ తెలిపింది. బాధితురాలు తాజా వ్యాఖ్యలపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.