Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలతో దుమారం.. టీపీసీసీ సీరియస్
బీసీ కులగణనతోపాటు పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న(Teenmar Mallanna) మాట్లాడారు.
- Author : Pasha
Date : 05-02-2025 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెల్చిన తీన్మార్ మల్లన్న.. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలే బీసీల రాజకీయ యుద్దభేరి సభలో మల్లన్న చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ‘‘రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం’’ అని మల్లన్న కామెంట్ చేశారు. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ కులగణనతోపాటు పార్టీ విధానాలకు విరుద్ధంగా మల్లన్న(Teenmar Mallanna) మాట్లాడారు. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదన్నారు. ఈ అంశాలపై మల్లన్నకు వ్యతిరేకంగా తెలంగాణ పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై క్రమశిక్షణా చర్యలకు టీపీసీసీ రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపుతారని అంటున్నారు.
Also Read :Pawan Kalyan : ఈరోజు నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది టూర్.. వివరాలివీ
బీసీ సంఘాల ఓట్లు అడగకుండా..
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అయితే ఈ నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని నేరుగా కాంగ్రెస్ పార్టీకే సవాల్ విసిరారు. బీసీల ఓట్లు మాకు వద్దు అని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని మల్లన్న ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందే మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆయన ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. దీంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొందారు.
Also Read :NTR Fans Meet : త్వరలో ఎన్టీఆర్ ఫాన్స్ మీట్.. ఫ్యాన్స్ ని చల్లబరిచేందుకే..
కాంగ్రెస్ పార్టీపైనే మల్లన్న విమర్శలు
కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అండతో ఆ ఎన్నికల్లో మల్లన్న గెలిచారు. తనకు రాజకీయంగా కీలక అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే మల్లన్న విమర్శలు చేస్తుండటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. హస్తం పార్టీ బలోపేతానికి కసరత్తు చేయకపోగా, దానిపైకే విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టడం సమంజసం కాదని పరిశీలకులు అంటున్నారు. ఈవిధమైన వైఖరి వల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టమే తప్ప.. ప్రయోజనం జరగదని చెబుతున్నారు.