Revanth vs Malla Reddy: రేవంత్ రెడ్డి నా హత్యకు కుట్ర పన్నారు : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణలో రెడ్ల సామాజికవర్గం అంశానికి సంబంధించిన వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది.
- By Hashtag U Published Date - 12:13 PM, Mon - 30 May 22

తెలంగాణలో రెడ్ల సామాజికవర్గం అంశానికి సంబంధించిన వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఆమధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెడ్ల సామాజికవర్గానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడంతో .. ఇతర వర్గాల నుంచి నిరసన వచ్చింది. దీంతో ఈ ఇష్యూను క్యాష్ చేసుకోవడానికి మంత్రి మల్లారెడ్డి ప్రయత్నించారు. అందుకే రెడ్ల సింహగర్జన సభలో దూకుడుగా మాట్లాడారు. అది కాస్తా సభకు వచ్చిన కార్యకర్తలకు నచ్చకపోవడంతో ఆయనపై దాడికి ప్రయత్నించారు. అయితే తనను హత్య చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఈ విషయం ఎటునుంచి ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
గత కొన్నాళ్లుగా మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. రేవంత్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అయినా తాను భయపడలేదని మల్లారెడ్డి చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఆయన తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఆయనను జైలులో పెడతామని వ్యాఖ్యానించారు. తనపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు మల్లారెడ్డి. దీంతో వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం పతాకస్థాయికి చేరినట్లయింది.
మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ పోరాటం ఇప్పటిది కాదు. ఇద్దరు నేతలూ టీడీపీలో ఉన్నప్పుడు విభేదాలు ఉండేవని రాజకీయవర్గాలు చెబుతుంటాయి. మల్లారెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పైగా ఇప్పుడు ఇద్దరూ వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. దీంతో ఈ నాయకులిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.