KCR : కేసిఆర్ మెడకు మేడిగడ్డ ఉచ్చు..?
కాలేశ్వరం ప్రాజెక్టుకు అతి కీలకమైన మేడిగడ్డ బరాజ్ పీర్లు కుంగిపోయిన ఉదంతం రోజురోజుకూ కేసిఆర్ (KCR) మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది.
- By Hashtag U Published Date - 10:48 AM, Thu - 26 October 23

By: డా. ప్రసాదమూర్తి
Medigadda Barrage Trap : కాలేశ్వరం ప్రాజెక్టుకు అతి కీలకమైన మేడిగడ్డ బరాజ్ పీర్లు కుంగిపోయిన ఉదంతం రోజురోజుకూ కేసిఆర్ (KCR) మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర స్థాయి నిపుణుల బృందం రాష్ట్రస్థాయి నిపుణుల పరిశీలనలు పూర్తయ్యాయి. నిర్మాణ లోపం తప్ప మరో విషయం ఏమీ ఉన్నట్టుగా ఈ దర్యాప్తు బృందాల పరిశీలనలో ఎక్కడా తేలినట్టు లేదు. మేడిగడ్డ బరాజ్ పీర్లు కుంగుతున్న విషయం పై నిపుణులు వ్యక్తం చేసిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అధికార బిఆర్ఎస్ నాయకుల అలసత్వాన్ని దుయ్యబడుతున్నారు. 1.20 లక్షల కోట్ల కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా హర్రీబుర్రీగా, అత్యంత బాధ్యతారహితంగా, ఒక పిచ్చి డిజైన్ తో నిర్మించారని, ఇది ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యానికి నిదర్శనం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి నిన్న తీవ్రంగా విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
మేడిగడ్డ, లక్ష్మీ బరాజ్ పీర్లు కుంగిన ఉదంతంతో కాలేశ్వరం ప్రాజెక్టు పనితీరు, దాని ఫలితాల పట్ల ఇప్పుడు అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ప్రాజెక్టు ఉపయోగం మీదనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు భద్రత స్థిరత్వం, ప్రయోజనాలు మొదలైన విషయాల్లో అందరూ అనేక రకాల అనుమానాలను ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టుకే ఒక వెన్నెముక లాంటిది. దీని పీర్లు కుంగిపోవడంతో ఆ ప్రభావం ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ల మీద ఘోరంగా పడుతుందని కిషన్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు ఉపయోగాలను కేసిఆర్ (KCR) ఎంత ప్రముఖంగా ప్రకటించారో, అవి ఆచరణలో నెరవేరటం లేదని కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఏడాదికి 400 టిఎంసిల నీరు ఈ ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతుందని కేసీఆర్ ప్రకటించారు. అయితే గడిచిన నాలుగేళ్లలో 150 టీఎంసీల నీరు మాత్రమే విడుదలైందని, అందులోనూ 104 టీఎంసీలు మాత్రమే రిజర్వాయర్లను నింపిందని మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి రిజర్వాయర్లు కేవలం ఒక టూరిస్ట్ కేంద్రాలుగా మారాయి తప్ప ఇరిగేషన్ పనులకు ఉపయోగపడలేదని కిషన్ రెడ్డి చేసిన అభియోగం చాలా తీవ్రమైనది. ప్రభుత్వం ఎన్ని లెక్కలు చూపించినా, కేవలం 57వేల ఎకరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిందని కిషన్ రెడ్డి తన లెక్కలు చూపిస్తున్నారు. మరి దీనికి అధికార బీఆర్ఎస్ పార్టీ వారు ఏం సమాధానం చెబుతారో చూడాల్సి ఉంది.
ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కాలేశ్వరం ప్రాజెక్టు చాలా దూరదృష్టితో, ఎంతో ప్రజోపయోగంగా ఉంటుందని చెప్పి ఆడంబరంగా నిర్మించారు. కానీ ఈ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఇప్పుడు తేలింది. మేడిగడ్డ బరాజ్ పీర్లు కుంగిపోవడం వెనక కుట్ర కోణం ఉందని చెప్పడానికి అధికార పార్టీ వారు ప్రయత్నాలు చేయడాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు క్షమించరని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ కూడా ఒకవైపు ఉంది. కేంద్ర స్థాయి బృందం గానీ, రాష్ట్రస్థాయి నిపుణుల బృందం గాని, ఇంజనీర్లు గాని ఎవరి పరిశీలనలోనూ పీర్లు కుంగిపోవడానికి కుట్ర కోణం ఉందని చెప్పే ఆధారాలు బయటపడలేదు. కాబట్టి ఈ ప్రాజెక్టును చాలా తొందరపాటు చర్యగా నిర్మాణం చేసి కీర్తి గడించాలని చూసిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఫలితాలను చూసి కొంత ఆత్మ రక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికే కేసీఆర్ చాలాచోట్ల వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఒకపక్క ఆయన పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంలో వందమంది రైతులు కేసిఆర్ (KCR)కు వ్యతిరేకంగా నిలబడతామని అల్టిమేట్ జారీ చేసిన వార్త కూడా ఇప్పుడు వైరల్ అయింది. ఇలాంటి సందర్భంలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో జరిగిన లోపాలను వెంటనే గుర్తించి, జరిగిన వైఫల్యానికి ఎవరు బాధ్యులో వారిని వారిపై చర్యలు తీసుకొని, ప్రాజెక్టుల సురక్షిత భవితవ్యానికి భరోసా ఇచ్చే ప్రయత్నాలకు అధికార పార్టీ పూనుకోవాల్సి ఉంటుంది. అంతవరకు మేడిగడ్డ బరాజ్ కేసిఆర్ (KCR) మెడకు ఒక గుది బండలా వేలాడుతూనే ఉంటుంది.
Also Read: India to Bharat : పాఠ్య పుస్తకాల్లో దేశం పేరు మార్పు: అభ్యంతరాలు.. ఆమోదాలు