Madhusudhana Chary : ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమే: మధుసూధనాచారి
MLC Madhusudhana Chary : ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ గూండాలను దాడికి వదిలేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని చెప్పారు.
- By Latha Suma Published Date - 03:26 PM, Thu - 12 September 24

MLC Madhusudhana Chary : మండలిలో విపక్ష నేత మధుసూధనాచారి కౌశిక్‌రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ గూండాలను దాడికి వదిలేశారని ఆరోపించారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమేనని చెప్పారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్‌ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఖండించారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ ఫైర్ అయ్యారు. కౌశిక్‌రెడ్డిపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అరికపూడి గాంధీ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Non Stick Cookware : గర్భిణీ స్త్రీలు నాన్-స్టిక్ కుక్‌వేర్‌లో వండినవి తినకూడదా..?
కాగా, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నంత పని చేశారు. చేసిన సవాలు మేరకు ఆయన కొండాపూర్‌లోని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి తన అనుచరులతో కిలిసి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనను మార్గమధ్యలో గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నా.. ఎట్టకేలకు కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు తెరిచి ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు గేటును మూసివేసి బారికేడ్లు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అదుపు చేయలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురవ్వగా పరిస్థితి మరింత ఉద్రక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరు పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగి గుడ్లు, టమాటాలు చెప్పులతో పరస్పరం దాడికి దిగారు. మరోవైపు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అరికపూడి గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గేటు దూకేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్ నేతలు చేరుకుంటున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనను పరామర్శించారు. తన ఇంటిపై జరిగిన దాడిని పల్లాకు వివరించారు. ఆయన ఇంటి వద్ద పగిలిన అద్దాలను పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు.