Location Tracking Device: గూడ్స్, ప్యాసింజర్ వాహనాల్లో ఇక ఆ డివైజ్ తప్పనిసరి !
రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతీ ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, గూడ్స్ వాహనాలతో పాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ రకం వాహనాలకు వీఎల్టీడీలను(Location Tracking Device) అమరుస్తామని అంటున్నారు.
- By Pasha Published Date - 11:02 AM, Sat - 1 March 25
Location Tracking Device: కొత్తగా వాహనాలు కొనబోతున్న వారికి అలర్ట్. ప్రతీ ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, గూడ్స్ వాహనాలకు ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్టీడీ)’లను అమర్చుకోవడాన్ని తెలంగాణలో తప్పనిసరి చేయనున్నారు. దీంతో ఈ నిబంధనను అమలు చేయనున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. సరుకు రవాణా వాహనాలతో పాటు ప్రయాణికుల వాహనాలకు తప్పనిసరిగా వీఎల్టీడీ ఉండాలని తెలంగాణ రవాణా శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో ఈ నిబంధన అమలుకు అనుమతి కోరుతూ కేంద్ర రవాణా శాఖ అధికారులకు ఇటీవలే లేఖ రాశామని తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, అత్యవసర సమయంలో వీఎల్టీడీ అమర్చిన వాహనాల కదలికలపై నిఘా ఉంచుతామని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రతీ ట్యాక్సీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, గూడ్స్ వాహనాలతో పాటు ఇప్పటికే తిరుగుతున్న ఈ రకం వాహనాలకు వీఎల్టీడీలను(Location Tracking Device) అమరుస్తామని అంటున్నారు.
Also Read :Top 5 Predictions 2025: ఈ ఏడాది జరగబోయే ఐదు విపత్తులివే.. టైం ట్రావెలర్ జోస్యం
వీఎల్టీడీని కొత్త వాహనాల్లో..
- వీఎల్టీడీ అంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్.
- ఏ వాహనంలోనైనా అనుకోని ఘటనలు జరిగితే, క్షణాల్లో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకోవచ్చు. అయితే తప్పనిసరిగా వాహనం నంబరు లేదా వాహనం నంబరులోని కనీసం చివరి నాలుగు అంకెలను చెప్పాలి.
- కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రవాణా శాఖకు అనుమతులు వచ్చిన తర్వాత ప్రయాణికుల వాహనాలు, గూడ్స్ వాహనాలను తయారు చేసే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్‌ను జారీ చేస్తుంది. వాహనాన్ని తయారు చేసే క్రమంలోనే వీఎల్టీడీని అమర్చాలని నిర్దేశిస్తుంది.
- ఇప్పటికే వినియోగంలో ఉన్న వాహనాల్లో వీఎల్టీడీ పరికరాన్ని అమర్చేందుకు దాదాపు రూ.10వేలు ఖర్చవుతాయి.
- లొకేషన్ ట్రాకింగ్ పరికరం లేని వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తారు.