Local Body Elections : ‘స్థానిక’ ఎన్నికలు.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
Local Body Elections : రాజకీయపరంగా ఈ ఎన్నికలు ముఖ్యమైన పరీక్షగా భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పునాదులను బలపరచుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది
- By Sudheer Published Date - 12:08 PM, Thu - 9 October 25

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారికంగా శంఖారావం మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తొలి దశ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామీణ పాలనలో కీలకమైన ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు శక్తిప్రదర్శన వేదికగా నిలుస్తాయని అంచనా. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాజకీయ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పార్టీ గ్రామస్థాయిలో బలాన్ని చూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖరారు
SEC ప్రకటన ప్రకారం, నామినేషన్ల స్వీకరణ నేటి (అక్టోబర్ 9) నుంచే ప్రారంభమై ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుంది. 12న నామినేషన్ల పరిశీలన, 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఓటింగ్ ఈ నెల 23న జరగనుంది. ఎన్నికల అనంతరం వచ్చే నెల 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణపై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా దళాలను మోహరించేందుకు హోం శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
రాజకీయపరంగా ఈ ఎన్నికలు ముఖ్యమైన పరీక్షగా భావిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు పునాదులను బలపరచుకోవడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ప్రజాదరణ పరీక్షగా మారనుండగా, బీఆర్‌ఎస్ తన బలాన్ని తిరిగి నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉంది. బీజేపీ మాత్రం గ్రామీణ ప్రాతంలో తన పాదముద్ర వేయాలనే వ్యూహంతో ఉంది. దీంతో ఈ ఎన్నికలు సాధారణ స్థానిక సంస్థల పోటీ కాకుండా, రాబోయే పార్లమెంట్ ఎన్నికల దిశలో రాజకీయ బారోమీటర్‌గా మారే అవకాశముంది.