Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో 200 మందికిపైగా పాకిస్థాన్ వాళ్లు ఉన్నారా..?
Hyderabad : వీలైనంత త్వరగా వారిని గుర్తించి పాక్‌కు పంపేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి
- By Sudheer Published Date - 04:43 PM, Fri - 25 April 25

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. పాకిస్తాన్ పౌరులపై చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సార్క్ వీసాలు రద్దు చేయడంతో పాటు, దేశంలోని పాకిస్తాన్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచిపెట్టాలన్న ఆదేశాలను హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు పంపారు. ఈ చర్యల్లో భాగంగా హైదరాబాద్ (Hyderabad) నగరానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపడింది. తాత్కాలిక వీసాలతో వచ్చిన 208 మంది పాక్ పౌరులు (Citizens of Pakistan) నగరంలో ఉన్నట్లు వెల్లడించింది.
Amit Shah : ఒక్క పాకిస్థాన్ వాడు కూడా ఉండదు.. రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు..!
ఈ విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ పోలీసు విభాగంలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులు వారి వివరాలపై విచారణ ప్రారంభించారు. వీలైనంత త్వరగా వారిని గుర్తించి పాక్‌కు పంపేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల భాగంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు పారామిలిటరీ బలగాల సెలవులు రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి.
దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కఠినమైన చర్యలు చేపడుతుంది. ప్రధాని మోదీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి బాధ్యులెవ్వరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరోవైపు భారత్‌ను వీడుతున్న పాకిస్తాన్ పౌరులు వాఘా సరిహద్దు వద్ద బారులు తీరారు. తమ బంధువులను కలుసుకునేందుకు మాత్రమే భారత్‌కు వచ్చామని చెబుతూ, ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెపుతున్నారు.