Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ లిక్కర్ సేల్స్ పెంచింది.. డెవలప్‌మెంట్ చేయలేదు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
- By Pasha Published Date - 12:59 PM, Thu - 23 May 24

Komati Reddy Venkat Reddy : బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప అభివృద్ధి జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వైన్ షాపుల పేరు మీద రూ.2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందన్నారు. లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. ఐఏఎస్‌లను అందరినీ పక్కన పెట్టి కేవలం నలుగురు ఐఏఎస్‌లను బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ ఎంకరేజ్ చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి ని బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టిందే కేటీఆర్ అని ఆయన పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష బాధ్యతను కేటీఆర్‌కు అప్పగిస్తే కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో హరీష్ రావు ఉన్నారట అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు, 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నారు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komati Reddy Venkat Reddy) ప్రశ్నించారు. ‘‘హైదరాబాద్‌లో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ది చేశామని కేటీఆర్ చెప్తున్నారు. ఎయిర్ పోర్టు, పీవీ ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేం ఏం చెప్పుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్సార్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కొనియాడారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
Also Read : Pushpa 2 Sooseki Song Promo : సూసేకి అగ్గిపుల్ల మాదిరి.. శ్రీవల్లి సాంగ్ ప్రోమో..!
‘‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా కేఏ పాల్‌లా తిరగాల్సిందే’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎటువంటి పర్మిషన్లు లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసులు కట్టారన్నారు. బీఆర్ఎస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువని.. కాంగ్రెస్‌కు 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందన్నారు. వచ్చే నెల 6,7,8 తేదీల్లో తాను, మంత్రి శ్రీధర్ బాబు కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాల్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చిస్తామన్నారు.