Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగ్గేదేలే అంటూ నేతల ప్రచార హోరు
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇంకో పది రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ గెలుపు కోసం ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతున్నాయి
- By Sudheer Published Date - 01:20 PM, Sat - 1 November 25
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇంకో పది రోజుల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తమ గెలుపు కోసం ప్రతిష్ఠాత్మకంగా పోరాడుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని ఓటర్లను ఆకట్టుకోవడానికి బడా నాయకులు బస్తీ బస్తీకి వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం కాంగ్రెస్‌కు బూస్ట్‌గా మారింది. కార్నర్ మీటింగ్‌లు, పాదయాత్రలు, జనసంభాషణల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమవుతూ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు నవీన్ యాదవ్, అజారుద్దీన్ కట్టుబడి ఉన్నారని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపాయని విమర్శిస్తూ వారిని నమ్మితే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరిస్తున్నారు.
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. షేక్‌పేటలో రోడ్‌షో నిర్వహించి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓటమి తప్పదని, వారికి డిపాజిట్ దక్కకుండా ఓడిస్తేనే రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలవుతాయని ప్రజలకు చెప్పారు. అజారుద్దీన్‌కి మంత్రిపదవి ఇవ్వడం ఓటర్లను మభ్యపెట్టడానికేనని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత విజయమే ఖాయం అని, కానీ ఆమె మెజార్టీ ఎంత అనేది మాత్రమే తేలాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి వచ్చినా ప్రజల మనసు గెలవలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై “గెలవలేని రౌడీని పోటీలో నిలబెట్టారు” అంటూ విమర్శలు గుప్పించారు.
ఇక బీజేపీ మాత్రం ఓ ప్రత్యేక వ్యూహంతో ప్రచారం కొనసాగిస్తోంది. ఇంటింటికి వెళ్లి ప్రజలతో నేరుగా కలుస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పులను “ఛార్జ్‌షీట్” రూపంలో ప్రజల ముందు ఉంచుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే బస్తీల్లో ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎంఐఎం నిర్ణయించిన వ్యక్తి మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహాయంతో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ పోటీ అసలైనదిగా బీజేపీ, ఎంఐఎం మధ్యే ఉందని ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా బీజేపీ తెలంగాణ ప్రజల కోసం చాలా మంచి చేస్తోందని, దీపక్ రెడ్డిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇలా మూడు పార్టీలు తమ తమ వ్యూహాలతో బస్తీ బస్తీ తిరుగుతూ ఓటర్ల మనసు గెలుచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.