Anirudh Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేటీఆర్ మద్దతు..ఏంజరగబోతుంది..?
Anirudh Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖండన రాకపోగా, కేటీఆర్ మాత్రం అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా నిలబడ్డారు
- Author : Sudheer
Date : 18-03-2025 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు ప్రకటించటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అనిరుధ్ రెడ్డి హైడ్రా (Hydraa) విధానంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలోని పెద్దలు హైడ్రా పేరుతో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నారని, పేదల ఇళ్లను కూలుస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఖండన రాకపోగా, కేటీఆర్ మాత్రం అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు మద్దతుగా నిలబడ్డారు.
Gold : గోల్డ్ ధర లక్షకు చేరుతుంది..? మరి బ్యాంక్లో గోల్డ్ తాకట్టుపెడితే ఎంత ఇస్తున్నారు..?
కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ పెద్దలు ప్రజలను దోచుకుంటున్నారని, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టిందని, ట్రిపుల్ ఆర్ స్కీమ్ కింద భూములను ఆక్రమిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా విమర్శలు చేసే రాజకీయాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు.
కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త మలుపు తీసుకొచ్చాయి. కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ నేత మద్దతు ఇవ్వడం వింతగా మారింది. తీన్మార్ మల్లన్న, అనిరుధ్ రెడ్డిల వ్యవహారం చూస్తే తెలంగాణలో త్వరలో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతుండగా, బీఆర్ఎస్ ఈ పరిస్థితిని ఉపయోగించుకునే యత్నంలో ఉందని అంటున్నారు. మరి కేటీఆర్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది? అనిరుధ్ రెడ్డి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.