KTR Son Himanshu : విద్యార్ధి దశలోనే మంచి పనులు.. గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చిన KTR తనయుడు
మంత్రి కేటీఆర్(KTR) తనయుడు హిమాన్షు(Himanshu) విద్యార్ధి దశలోనే ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.
- By News Desk Published Date - 09:00 PM, Tue - 11 July 23

సీఎం కేసీఆర్(CM KCR) మనవడు, మంత్రి కేటీఆర్(KTR) తనయుడు హిమాన్షు(Himanshu) విద్యార్ధి దశలోనే ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. హిమాన్షు ఖాజాగూడ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్(Oakridge International School)లో మొన్నటి వరకు చదువుకున్నాడు. ఇటీవలే CBSE లో ప్లస్ 2 పూర్తి చేసి స్కూల్ నుంచి బయటకు వచ్చాడు. అయితే స్కూల్ లో చదివేటప్పుడు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చేపట్టే కమ్యూనిటీ సర్వీస్ లో భాగంగా అక్కడి విద్యార్థులు గౌలిదొడ్డి కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠాలు చెప్పడానికి వెళ్లేవారు. ఈ విభాగానికి హిమాన్షు అధ్యక్షత వహించేవాడు.
ఆ ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే అక్కడ వసతులు సరిగ్గా లేవని గమనించి పాఠశాలని మార్చాలని హిమాన్షు భావించి అక్కడి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఆ పాఠశాల బాగుకోసం చందాలు వసూలు చేసి దాదాపు 90 లక్షలు పోగు చేశాడు. స్కూల్ విద్యార్థులతో పాటు అనేకమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు హిమాన్షు చేసే మంచి పనికి తోడయ్యారు.
హిమాన్షు వసూలు చేసిన డబ్బుతో కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల రూపురేఖల్ని మార్చేశాడు. కొత్త బెంచీలు, మరుగుదొడ్లు, డైనింగ్ గది, ఆట స్థలం, ప్రతి గదిలో బల్బులు, ఫ్యాన్లు, కుర్చీలు, పాఠశాలకు బోరు, రెండు గదులు, గ్రంధాలయం, పాఠశాలకు రంగులు.. ఇలా అన్ని సౌకర్యాలు హిమాన్షు అమర్చాడని అక్కడి ప్రిన్సిపాల్ తెలిపారు. హిమాన్షు పుట్టిన రోజు జులై 12న ఈ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రీ ఓపెనింగ్ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలను ఇంత మంచిగా మార్చి, సౌకర్యాలు ఏర్పరిచినందుకు అక్కడి విద్యార్థులు తల్లితండ్రులు, టీచర్లు హిమాన్షుని అభినందిస్తున్నారు. తాత, తండ్రి లాగే మంచి పనులు చేసి భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవ్వాలని దీవిస్తున్నారు.
Also Read : KTR: కాంగ్రెస్ కుట్రలను తెలంగాణ రైతాంగం తిప్పికొట్టాలి: కేటీఆర్