KTR : రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు..18 ఏళ్ల నుండి తెలుసు కానీ..: కేటీఆర్
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో సీఎం రేవంత్‌ని ఏకవచనంతో కేటీఆర్ పిలవడంతో అధికార పక్ష సభ్యులు ఆగ్రహం
- By Latha Suma Published Date - 04:50 PM, Wed - 31 July 24
KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy)తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన అదృష్టవంతుడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే.. గత పది సంవత్సరాల్లో ఏం మంచి జరిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్(KCR) ఫోబియా పట్టుకుందని ఆయన సెటైర్ వేశారు. మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని అంటున్నారని, చేరిపేయలేని, తుడిపేయలేని, దాచెయ్యలేని ఆనవాళ్లు కేసీఆర్ ఆనవాళ్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చెరిపేస్తారు కేసీఆర్ ఆనవాళ్లను అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్.. కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్.. భగీరథ నల్ల నీళ్లలో కేసీఆర్.. పాలమూరు జలధారల్లో కేసీఆర్.. సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్.. గురుకుల బడిలో కేసీఆర్.. యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్.. విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్.. మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్.. కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్‌లో కేసీఆర్.. మీరు కూర్చున్న సచివాలయపు సౌధ రాజసంలో కేసీఆర్.. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్ సృజనలో కేసీఆర్.. వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్.. ప్రపంచంలోని అతి పెద్ద అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్.. అమర దీపం ఆశయల్లో కేసీఆర్ ఉన్నారని అని కేటీఆర్ పేర్కొన్నారు.