KTR – AP Elections : ఏపీ ఎన్నికలపై మనసులో మాట చెప్పేసిన కేటీఆర్
KTR - AP Elections : ఓ వైపు పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 13-05-2024 - 12:51 IST
Published By : Hashtagu Telugu Desk
KTR – AP Elections : ఓ వైపు పోలింగ్ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంతకంటే ఎక్కువ సవాళ్లతో కూడిన ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని, విజయాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లనే సాధిస్తామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామని చెప్పుకుంటారు. కానీ అంతిమ తీర్పు ఇచ్చేది మాత్రం ప్రజలే’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘‘వైఎస్ జగన్ నాకు సోదరుడి లాంటివాడు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ (KTR – AP Elections) మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఒక గ్యారెంటీని మాత్రమేు సగం సగం అమలు చేసింది. కరెంటు కోతలు , నీటి కొరతపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలి. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేయాలి’’ కేటీఆర్ సూచించారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీరామచంద్ర ప్రభువులా రాజధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి. యావత్ భారతదేశ ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేశారు అనేది జూన్ నాలుగో తేదీన తేలిపోతుంది. గత పది సంవత్సరాలుగా దేశ ప్రజలను నరేంద్ర మోడీ మోసం చేస్తుంటే.. వందరోజులుగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు’’ ఆయన ఆరోపించారు. ‘‘ఇవాళ పోలింగ్ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన కరెంటు కోతలను చూస్తుంటే మరో ఆరు గ్యారంటీలను ప్రజలకు ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. అవే.. ఇన్వర్టర్లు, జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, ఛార్జింగ్ లైట్లు’’ అని కేటీఆర్ విమర్శించారు. ‘‘తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్.. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్. ఈవిషయం తెలంగాణ ప్రజలకు తెలుసు’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నంది నగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును కేటీఆర్ కుటుంబం వినియోగించుకుంది.