Ganpati Bappa Morya : గంగమ్మ ఒడికి చేరిన మహా గణపతి
నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణపతి..కొద్దీ సేపటి క్రితం విశేష భక్తుల కోలాహలం నడుమ గంగమ్మ ఒడికి చేరాడు
- Author : Sudheer
Date : 28-09-2023 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) తల్లి గంగమ్మ ఒడిలోకి (Hussain Sagar) చేరాడు. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణపతి..కొద్దీ సేపటి క్రితం విశేష భక్తుల కోలాహలం నడుమ గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద బుధవారం అర్ధరాత్రి దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. గురువారం వేకువ జామునే మహా శోభాయాత్ర (Khairatabad Ganesh Shobha Yatra) మొదలైంది. బైబై వినాయకా అంటూ పెద్ద ఎత్తున భక్తులు రోడ్ల పైకి వచ్చి గణపయ్యకు వీడ్కోలు తెలిపారు.
ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర సచివాలయం ముందు నుంచి హుస్సేన్‌సాగర్ వరకు శోభాయాత్ర సాగింది. అనంతరం నాలుగో నంబర్ క్రేన్ వద్ద చివరి పూజ చేసి నిమజ్జనం చేశారు. గణేష్ నిమజ్జన వేడుక త్వరగా పూర్తి చేయడం ఫై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అయితే జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు.
మరోపక్క గణేష్ నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనానికి హుసేన్ సాగర్‌తో పాటు 33 చెరువులను సిద్ధం చేసారు. ఇక్కడ 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్ బృందాలను రెడీ చేశారు. అలాగే నిమజ్జనం సందర్భంగా రాత్రి రెండు గంటల వరకు మెట్రో సర్వీస్‌లు పొడిగించారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, గాంధీభవన్, నాంపల్లి మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందిని నియమించారు.
Read Also : Singareni Polls: సింగరేణిలో పోరులో సైరన్ మోగించేదెవరో.. మినీ యుద్ధంలో గెలుపు ఎవరిదో!