Revanth Wish : కేసీఆర్ నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి..అదే నా కోరిక – సీఎం రేవంత్
Revanth Wish : కేసీఆర్ నువ్వు బాయిలో దూకుతావో, పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకుంటావో అది నీ ఇష్టం ..నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి వచ్చి అపోజిషన్లో కూర్చొని మేము చేసే మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి.. అందుకే అసెంబ్లీకి రమ్మంటున్నాను
- By Sudheer Published Date - 07:04 PM, Fri - 18 July 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) మరోసారి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగర్‌కర్నూల్ జిల్లా జటప్రోలులో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్” శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. సీఎం పదవిలో ఉండి కూడా కేసీఆర్ (KCR) ఈ ప్రాంతానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రజలు ఆశించిన అభివృద్ధి చేయకుండా బలహీన వర్గాలపై తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కుమిలి కుమిలి ఏడవాలని తన కోరిక అని ఘాటుగా వ్యాఖ్యానించారు. “నువ్వు బాయిలో దూకినా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న అది నీ ఇష్టం. కానీ అసెంబ్లీకి వచ్చి మా మంచి పనులు చూసి బాధపడాల్సిందే” అని ఆయన తేల్చేశారు.
WCL 2025 : కెప్టెన్ గా యువరాజ్ సింగ్.. ఇండియా ఛాంపియన్స్ జట్టు ఇంగ్లండ్‌లో సిద్ధం
పాలమూరు గడ్డపై కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. కేసీఆర్ వలస వచ్చి 2009లో పాలమూరులో నుంచి పోటీ చేసి గెలిచారని, కానీ పాలమూరుకు ఏమాత్రం న్యాయం చేయలేదని మండిపడ్డారు. 98 జీవో నిర్వాసితుల విషయంలో కూడా ఆయన నిష్క్రియగా ఉన్నారని తెలిపారు. నల్లమల అడవిలో పుట్టిన తనలాంటి వ్యక్తి సీఎం అయితే కేసీఆర్ కు అసూయగా ఉందని విమర్శించారు. గత పదేళ్లలో పాలమూరుకు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతున్నంత పని చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం 25 కోట్లతో పూర్తయ్యే పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోకుండా లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించి దానిని ‘కూలేశ్వరం’గా మార్చారన్నారు.
ప్రజల కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి చెబుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ. 500 బోనస్, రుణమాఫీ, విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామని వివరించారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తూ, వారిని బస్సుల యజమానులుగా మారుస్తున్నామని, విద్యా ప్రాజెక్టుల్లో కూడా మహిళల పాత్రను పెంచుతున్నామని తెలిపారు. “మీ దగ్గరే పదవులు ఉంటాయి, కానీ మేము ప్రజల హృదయాల్లో ఉంటాం” అంటూ బీఆర్‌ఎస్ నేతలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.