KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఆ లేఖ తర్వాతే ఎందుకు?
NDSA రిపోర్ట్‌లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్‌లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది.
- By Gopichand Published Date - 08:18 PM, Tue - 27 May 25

KCR: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్‌కు సంబంధించి లార్సెన్ అండ్ టర్బో (L&T) రాసిన లేఖ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR).. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మొదట్లో కేసీఆర్ ఈ విచారణ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి మీడియా ముందు పలు వ్యాఖ్యలు చేయడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు పరిశీలన తర్వాత నరసింహారెడ్డిని చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆదేశించింది. కొత్త చైర్మన్ నియామకంలో జాప్యం కారణంగా విచారణ కూడా ఆలస్యమైంది. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ విచారణకు భయపడుతున్నారని విస్తృత ప్రచారం చేసింది.
Also Read: IPL 2025 Beautiful Cheerleader: ఐపీఎల్ 2025లో అందమైన చీర్‌లీడర్ ఈమే?
అయితే ప్రజల్లోని అపోహలను తొలగించడం, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం లక్ష్యంగా కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరవనున్నట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా స్వయంగా హాజరవుతారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. కమిషన్ నుండి కొన్ని ప్రశ్నలు ముందుగానే కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. ఇది ఆయనకు సమాధానాలను సిద్ధం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
NDSA రిపోర్ట్‌లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్‌లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది. 2016లో నాణ్యత నియంత్రణ మాన్యువల్, త్రైమాసిక నాణ్యత తనిఖీలు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ధృవీకరణలను సమర్పించినట్లు పేర్కొంది. ఈ లేఖ కేసీఆర్, హరీష్ రావులు మొదటి నుండి చెబుతున్న “నిర్మాణంలో నాణ్యత లోపాలు లేవు” అనే వాదనకు బలం చేకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి, నిర్మాణ లోపాలను ఆరోపిస్తూ రాజకీయంగా దూషిస్తోంది. అయితే L&T లేఖ, కేసీఆర్ విచారణకు హాజరయ్యే నిర్ణయం BRSకు రాజకీయంగా కొంత ప్రయోజనం చేకూర్చవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.