Telangana Elections : ఎన్నికల దిశగా కేసీఆర్! కలెక్టర్లకు `వారం` టార్గెట్లు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. కలెక్టర్లకు `వారం-వారం` టార్గెట్ పెట్టారు.
- Author : CS Rao
Date : 19-09-2022 - 3:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. కలెక్టర్లకు `వారం-వారం` టార్గెట్ పెట్టారు. సంక్షేమ పథకాలు, భూముల వివాదాలు, ధరణి పోర్టల్‌తో “ఫీల్ గుడ్ ఫ్యాక్టర్”ని సృష్టించే లక్ష్యం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లకు “వారం ప్రాధాన్యతలనుష ఫిక్స్ చేశారు. ప్రభావితం చేసే అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించేలా జిల్లా కలెక్టర్లకు వారానికోసారి ప్రాధాన్యతలు మరియు లక్ష్యాలను ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను రావు ఆదేశించారు. దీంతో సీఎస్ కలెక్టర్లందరికీ లేఖలు పంపారు.
ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ టీమ్‌లు నిర్వహించిన సర్వేల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సొంత నియోజకవర్గాలను కాదని హైదరాబాద్ లో ఉంటోన్న 50 నుంచి 60 ఎమ్మెల్యే కారణంగా వ్యతిరేకత ఉన్నట్టు తేలిందట. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ పనితీరు పట్ల ఓటర్లు సంతృప్తిగా ఉన్నారని సర్వేల సారాంశం. అయితే, హైదరాబాద్‌కే పరిమితమై ఓటర్లతో సంబంధాలు లేకుండా ఉండే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం అసంతృప్తి బాగా ఉందట. హైదరాబాద్‌కే పరిమితం కావొద్దని సెప్టెంబర్ 3న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. జిల్లాల్లోనే ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం వారికి సూటిగా చెప్పారు. ఓటర్లతో మమేకం కావడానికి ‘సామూహిక మధ్యాహ్న భోజన కార్యక్రమాలు’ నిర్వహించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన విషయం విదితమే.
Also Read: TRS Congress Alliance : కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై `షా` సంకేతాలు
పోడు భూ వివాదాలు, ఆసరా పింఛన్ల పంపిణీ, పెండింగ్‌లో ఉన్న జిఓ 59 భూ క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్లియర్ చేయడం, పట్టాదార్ పేర్లు, భూ విస్తీర్ణంలో సవరణలు, ధరణి పోర్టల్‌లోని కేసుల పరిష్కారం తదితర అంశాలు ఓటర్లను ప్రభావితం చేసేవిగా ఉన్నాయని సర్వేలు తేల్చాయట. అందుకే, కలెక్టర్లకు వారం టార్గెట్ పెట్టడం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ప్రతి వారం జాబితా చేసిన అన్ని సమస్యలపై చర్యలు తీసుకున్న నివేదికలను (ఎటిఆర్‌లు) సమర్పించాలని కలెక్టర్లను సీఎస్ కోరడం కేసీఆర్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని స్పష్టం చేస్తోంది.