Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు.
- Author : Gopichand
Date : 26-10-2025 - 12:27 IST
Published By : Hashtagu Telugu Desk
Jubilee Hills By Election: తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By Election) లో చారిత్రక తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ అవినీతి, అహంకారాన్ని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నాడు వెంగళరావు నగర్ డివిజన్‌లోని మధురానగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్, ఈ ఉప ఎన్నికలో చేయబోయే కుయుక్తులను తిప్పికొట్టాలని ఆయన ప్రజలను కోరారు.
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు. నియోజకవర్గంలో స్థానికుడిగా, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మాధురానగర్ కాలనీలోని మౌలిక వసతుల లోపాలు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ‘చేతి గుర్తు’కు వేసి తనను గెలిపించాలని ఆయన వినయంగా అభ్యర్థించారు.
Also Read: Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న నగరాలివే!
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా నడుస్తోందని, ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతోందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తమ అభ్యర్థి గురించి మాట్లాడటం, కాంగ్రెస్ విజయం అక్కడే అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. “నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అయితే, గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉన్నాయో బీఆర్‌ఎస్ నేతలు బయట పెట్టాలి. కావాలని మా అభ్యర్థిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు” అని ఆయన బీఆర్‌ఎస్ ఆరోపణలను తిప్పికొట్టారు.
“జూబ్లీహిల్స్ అంటే క్లాస్ పీపుల్ అని అందరూ అనుకుంటారు. కానీ ఇది మాస్ ఏరియా. మాస్ ఏరియా ప్రజలకు అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీనే గుర్తుకొస్తుంది. కచ్చితంగా యువకుడైన మా అభ్యర్థిని ప్రజలు గెలిపిస్తారు” అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. కంటోన్మెంట్‌లో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదని, ఇక్కడ కూడా అదే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.