Telangana State Formation Day : తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఇదేనా..?
- By Sudheer Published Date - 04:25 PM, Wed - 29 May 24

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana State Formation Day) ఘనంగా జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు కార్యక్రమాలపై సీస్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు ఫస్ట్ టైం లో తెలంగాణ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కన్నులపండుగగా జరపాలని చూస్తుంది. వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ప్రకటించినట్టుగా తెలంగాణ రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్ర గీతాన్ని రూపొందించేందుకు అందెశ్రీకి బాధ్యతలు అప్పగించగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందించే బాధ్యతలను కళాకారుడు రుద్ర రాజేశానికి అప్పజెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. అధికారిక చిహ్నానికి సంబంధించిన మూడు రకాల లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ.. ఆ మూడు లోగోల ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటోల్లో మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం.. పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ ఉంది. పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు కూడా ఉన్నాయి. రెండో లోగోలో పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, మధ్యలో తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బొమ్మ కనిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న మూడు లోగోల్లోనూ తెలంగాణ ప్రభుత్వం అని ఇంగ్లీష్, తెలుగు, ఉర్దుతో పాటు హిందీ భాషలోను రాశారు. ప్రస్తుతం ఉన్న లోగోలో హిందీ లేదు. అలాగే ప్రస్తుత చిహ్నం కేవలం గోల్డ్, గ్రీన్ రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేయగా కొత్తగా వైరల్ అవుతున్న చిహ్నం ఫోటోలు మాత్రం మల్టిపుల్ కలర్స్ లో దర్శనం ఇస్తున్నాయి. ఇవి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం రూపొందించిన అధికారిక నమూనాలేనా లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
Read Also : Silly Monks : లాభాల్లోకి సిల్లీ మాంక్స్.. ఉద్యోగులకు ఈసాప్స్ ఇస్తున్నట్టు ప్రకటన..