Silly Monks : లాభాల్లోకి సిల్లీ మాంక్స్.. ఉద్యోగులకు ఈసాప్స్ ఇస్తున్నట్టు ప్రకటన..
కేజీఎఫ్, కేజీఎఫ్2, కాంతార, సలార్ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంలో డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్ 'సిల్లీ మాంక్స్' కూడా కీలక పాత్ర పోషించింది.
- By News Desk Published Date - 04:18 PM, Wed - 29 May 24

Silly Monks : కేజీఎఫ్, కేజీఎఫ్2, కాంతార, సలార్ వంటి సినిమాలు సూపర్ హిట్ అవ్వడంలో డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్ ‘సిల్లీ మాంక్స్’ కూడా కీలక పాత్ర పోషించింది. మరో నెలలో రిలీజ్ కాబోతున్న ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి కూడా సిల్లీ మాంక్స్ డిజిటల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఇలా ఎంటర్టైన్మెంట్ రంగంలోని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యాలుగా వ్యవహరిస్తూ సిల్లీ మాంక్స్ ఎంతో కీర్తిని, బలాన్ని అందుకుంది.
దీంతో సిల్లీ మాంక్స్ ఇప్పుడు లాభాలు బాట పట్టింది. నాలుగేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న ఈ సంస్థ.. ఇప్పుడు లాభదాయకతను సాధించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థకు రూ. 552.15 లక్షల నష్టం వచ్చింది. అయితే ఎంప్లాయీస్ వనరుల సమర్థ వినియోగం, వ్యూహాత్మక పునర్నిర్మాణంతో సిల్లీమాంక్స్.. ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి రూ.26.83 లక్షల లాభాన్ని (పన్నుకు ముందు), 2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 9.46 లక్షల లాభాన్ని (పన్నుకు ముందు) సాధించి పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది.
దీంతో కంపెనీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకొంది. సిల్లీ మాంక్స్ తన ఉద్యోగులను మరింత శక్తివంతం చేయడానికి మరియు కస్టమర్ కేంద్రీకృత సంస్కృతిని పెంపొందించడానికి.. ఈసాప్ పథకాన్ని ప్రారంభించింది. మొత్తం షేర్ క్యాపిటల్‌లో ఈసాప్ విలువ ఐదుశాతం ఉంటుంది. దీని నుంచి కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల కోసం 70శాతాన్ని కేటాయించింది. అలాగే రానున్న ఐదేళ్లలో సమానంగా జారీ చేయనుంది. ఈ నిర్ణయం వల్ల సిల్లీ మాంక్స్ బృంద సభ్యులు భవిష్యత్తులో కంపెనీ విజయంలో సమగ్ర వాటాదారులు అవుతారు.
ఇక ఈ సందర్భంగా సిల్లీ మాంక్స్ సహ వ్యవస్థాపకుడు, ఎండీ సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. “నాలుగు సంవత్సరాల తర్వాత సిల్లీ మాంక్స్ లాభాలు బాట పట్టడం గొప్ప విజయం. ఎంతో అంకితభావంతో కూడిన బృందం మరియు వ్యూహాత్మక కార్యక్రమాల వల్లే ఈ ఘనత సాధ్యపడింది. ఆర్థికస్థితిని మెరుగ్గా మార్చడంలో క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానం, వ్యూహాత్మక దృష్టి చాలా కీలకం. అలాంటి బలమైన ప్రణాళికలు ప్రతిభావంతులైన బృందంతో బలమైన ఆర్థిక పనితీరును కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం” అంటూ వ్యాఖ్యానించారు.