Indiramma Housing Scheme 2025 : ప్రభుత్వం కీలక నిర్ణయం
Indiramma Housing Scheme 2025 : ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చేయడంతో పాటు, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది
- By Sudheer Published Date - 11:11 AM, Wed - 12 February 25

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ (Indiramma Housing Scheme 2025 ) ను మరింత పారదర్శకంగా, అక్రమాలకు ఆస్కారం లేకుండా అమలు చేసేందుకు నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండ్ల నిర్మాణానికి శాటిలైట్ సేవలను, మేధోసత్తా (AI) సాంకేతికతను వినియోగించనుంది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ నిధులు సరైన వారికి చేరేలా చేయడంతో పాటు, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త విధానంలో, ఇంటి నిర్మాణం ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు ప్రతి దశను శాటిలైట్ ద్వారా నిశితంగా పరిశీలించనున్నారు. నిర్మాణ స్థలానికి సంబంధించిన అక్షాంశ, రేఖాంశ సంఖ్యలను ఖరారు చేసి వాటిని శాటిలైట్‌కు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా ప్రతి దశలో జరుగుతున్న అభివృద్ధిని ఆన్లైన్లో ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ లబ్దిదారులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పనులు పూర్తయ్యే దశలను అధికారుల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పనుల స్థితిగతుల్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయనున్నారు. ఈ నిర్ణయాల ద్వారా నకిలీ లబ్దిదారులను గుర్తించి, అర్హులైనవారికి మాత్రమే సహాయం అందేలా చూసే అవకాశం ఉంది. ప్రభుత్వం నిధులను పారదర్శకంగా పంపిణీ చేయడం, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అధునాతన సాంకేతికతను వినియోగించడం వల్ల లబ్దిదారులకు గందరగోళం లేకుండా వేగంగా నిధులు అందేలా అవుతుంది. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌లో చేపట్టిన ఈ మార్పులు, ప్రభుత్వానికి, లబ్దిదారులకు ప్రయోజనకరంగా మారనున్నాయి. నిర్మాణ పనుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అవినీతిని అరికట్టే ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ మద్దతుతో నాణ్యమైన గృహం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం.