Harishrao : కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవే లేదు: హరీశ్‌రావు
Harishrao : విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు.. ఇదేనా నీ పాలన అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయం, తాగు నీరు, విద్య, వైద్యం, నేతన్నల మీద చర్చకు వస్తావా అంటూ హరీశ్‌రావు సీఎంకు ఛాలెంజ్ చేశారు.
- By Latha Suma Published Date - 03:14 PM, Tue - 12 November 24

CM Revanth Reddy : మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. రేవంత్ ఏడాది పాలనలో ప్రతి వర్గం ఎంతో నష్ట పోయిందన్నారు. కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్తాం.. చర్చకు రావలే అంటూ సవాల్ విసిరారు. దేవుడి మీద ఒట్టు వేసినవ్.. రుణమాఫీ చెయ్యి అంటూ డిమాండ్ చేశారు. సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి రాగాలు తీయవద్దన్నారు. వానకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని… కనీసం యాసంగికి అయినా ఇస్తావా లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే రేవంత్‌కు సీఎం పదవే లేదన్నారు. రైతులు రోడ్డెక్కారు.. విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు.. ఇదేనా నీ పాలన అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. వ్యవసాయం, తాగు నీరు, విద్య, వైద్యం, నేతన్నల మీద చర్చకు వస్తావా అంటూ హరీశ్‌రావు సీఎంకు ఛాలెంజ్ చేశారు.
ఇక వికారాబాద్ ఘటనపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరు అమానుషం.. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకుని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణమైన విషయమన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని ఆరోపించారు. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని, ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశం తెలియాలని విమర్శించారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలని ఆరోపించారు. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణమే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.