MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతాను : జీవన్‌రెడ్డి
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు.
- Author : Pasha
Date : 25-06-2024 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
MLC Jeevan Reddy : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక వహించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, పల్లెలన్నీ తిరుగుతానని ఆయన ప్రకటించారు. ప్రజల అభిప్రాయం మేరకు రానున్న రోజుల్లో తగిన నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి వెల్లడించారు. ‘‘నాతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఫోనులో మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నన్ను కోరారు. హైదరాబాద్‌కు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షీ చెప్పారు’’ అని జీవన్ రెడ్డి తెలిపారు. ‘‘నిన్నటి నుంచి రాష్ట్ర మంత్రులు నాతో మాట్లాడుతున్నారు’’ అని ఆయన చెప్పారు. ‘‘ఏ పార్టీ నుంచి కూడా నాకు కాల్స్ రాలేదు. బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ నాతో ఎవరూ మాట్లాడలేదు. ఏ పార్టీ నన్ను ప్రభావితం చేయలేదు. ఇప్పట్లో నేను ఏ పార్టీలోకి వెళ్లదల్చుకోలేదు’’ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. జీవన్ రెడ్డితో ఆయన పార్టీ తరఫున చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డిని లక్ష్మణ్ కోరనున్నట్లుసమాచారం.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎవరిపై కొట్లాడానో.. వాళ్లనే నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఇది మంచిది కాదు’’ అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా ? ఇంకా నాకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు? ’’ అని ఆయన ధ్వజమెత్తారు.