Sonia Gandhi : ఇచ్చిన మాట నిలుపుకున్నాం.. తెలంగాణ ఏర్పాటు చేశాం : సోనియాగాంధీ
‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను.
- By Pasha Published Date - 12:02 PM, Sun - 2 June 24

Sonia Gandhi : ‘‘తెలంగాణ రాష్ట్రం ఇస్తానని 2004లో కరీంనగర్ సభ వేదికగా హామీ ఇచ్చాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను’’ అని సోనియా గాంధీ తెలిపారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు నేను తీసుకున్న నిర్ణయం వల్ల మా పార్టీలో అసమ్మతి ఏర్పడింది. కొందరు నేతలు మా నిర్ణయాన్ని విభేదించి విడిపోయారు. అయినా మేం ఇచ్చిన మాటను తప్పలేదు. దాని నిలబెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం’’ అని ఆమె తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఈమేరకు సోనియాగాంధీ(Sonia Gandhi) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలమని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన తొలి జాతీయ పార్టీ తమదేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నామని సోనియా స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు శుభం జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
Also Read : PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. పదేళ్ల కిందట డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత, ప్రజా తెలంగాణ సాకారం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం
తెలంగాణ అవతరణ దినోత్సవం వేళ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతికి నిలయమన్నారు. దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ అవతరించడం గొప్ప విషయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలని దేశ అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. తెలంగాణ మరింతగా ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.