Hydra Demolitions : తెల్లవారుజామునే రంగంలోకి హైడ్రా.. కోట్లు విలువైన విల్లాల కూల్చివేతలు
భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు(Hydra Demolitions) జరిగాయి.
- By Pasha Published Date - 10:05 AM, Sun - 8 September 24

Hydra Demolitions : హైడ్రా అధికారులు ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్ నగరంలో రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్‌లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కు చెందిన విల్లాలలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేశారు. మల్లంపేట్ (కత్వ) చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ సంస్థ కోట్లు విలువైన విల్లాలను నిర్మించిందని గతంలోనే హైడ్రా అధికారులు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు(Hydra Demolitions) జరిగాయి.
- దీంతోపాటు మాదాపూర్‌లోని సున్నం చెరువుకు చెందిన ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ ఏరియాలో నిర్మించిన షెడ్లు, భవనాలను అధికారులు కూల్చేశారు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లలో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేస్తున్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో వాటిని తొలగించారు.
- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చారు. భారీగా పోలీసులను మోహరించి ఈ కూల్చివేతల ప్రక్రియను హైడ్రా అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.
Also Read :Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
హైదరాబాద్‌లోని కబ్జాకోరుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. ఎవరినీ లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే దాదాపు 18 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి హైడ్రా విడిపించింది. తాజాగా ప్రముఖ స్థిరాస్తి సంస్థ జయభేరికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగళాల్ కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. గతంలో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నిర్మించారనే అభియోగాలతో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చారు.