Islamic Countries Alliance : ఇస్లామిక్ దేశాల కూటమితో ఇజ్రాయెల్ ఉగ్రవాదాన్ని ఆపుదాం: ఎర్దోగన్
పశ్చిమాసియా ప్రాంతంలోని మితవాద అరబ్ దేశాలను(Islamic Countries Alliance) అణగదొక్కే లక్ష్యంతో ఇరాన్‌తో చాలా ఏళ్లుగా టర్కీ కలిసి పనిచేస్తోందని ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.
- By Pasha Published Date - 09:43 AM, Sun - 8 September 24

Islamic Countries Alliance : పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో దాదాపు 40వేల మంది చావుకు ఇజ్రాయెల్ కారణమైందని టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దోగన్ ఆరోపించారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ఆపేందుకు ఇస్లామిక్ దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెలీ కాలనీల విస్తరణను ఆపాలంటూ శుక్రవారం జరిగిన నిరసనల్లో దారుణం జరిగింది. నిరసనకారులపైకి ఇజ్రాయెలీ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో టర్కిష్- అమెరికన్ మహిళ చనిపోయింది. దీనిపై స్పందిస్తూ.. టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దోగన్ పైవ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ విస్తరణ వాదాన్ని అడ్డుకోవాలంటే ఇస్లామిక్ దేశాలన్నీ కలిసికట్టుగా ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ దురహంకారాన్ని ఆపేందుకు ఇస్లామిక్ దేశాల కూటమి ఏర్పాటు ఒక్కటే ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు.
Also Read :Munneru Floods Threat: మున్నేరుకు మరోసారి వరద గండం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ఇస్లామిక్ పాఠశాలల అసోసియేషన్ కార్యక్రమంలో ఎర్దోగన్ ప్రసంగించారు. ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేసేందుకే ఈజిప్ట్, సిరియాలతో టర్కీ సంబంధాలను బలోపేతం చేస్తున్నామని ఆయన తెలిపారు. లెబనాన్, సిరియాలకు కూడా ఇజ్రాయెల్ నుంచి ముప్పు పొంచి ఉందని.. వాళ్లు అప్రమత్తంగా ఉండటం మంచిదని ఎర్దోగన్ హెచ్చరించారు. ఎర్దోగన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మండిపడ్డారు. ఇస్లామిక్ దేశాలను రెచ్చగొట్టేలా ఎర్దోగన్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని మితవాద అరబ్ దేశాలను(Islamic Countries Alliance) అణగదొక్కే లక్ష్యంతో ఇరాన్‌తో చాలా ఏళ్లుగా టర్కీ కలిసి పనిచేస్తోందని ఇజ్రాయెల్ కాట్జ్ ఆరోపించారు.
Also Read :Vetayyan Postpone : వెటయ్యన్ కూడా రిలీజ్ డౌటేనా..?
కాగా, ఈ వారంలో టర్కీలోని అంకారాలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్-సిసితో ఎర్దోగన్ భేటీ అయ్యారు. ఈజిప్టు అధ్యక్షుడు టర్కీలో పర్యటించడం 12 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. సిరియా అంతర్యుద్ధం తర్వాత 2011 నుంచి ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ బాగా పెరిగింది. మళ్లీ ఇప్పుడు ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేసేందుకు టర్కీ, ఈజిప్టు సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి.