Hydra : బీజేపీ కార్పొరేటర్ అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా
తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
- By Pasha Published Date - 05:18 PM, Sat - 31 August 24

Hydra : హైదరాబాద్ నగరంలోని కబ్జా కోరుల పాలిట ‘హైడ్రా’ విభాగం సింహస్వప్నంగా మారింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అప్ప చెరువు ఎఫ్‌టీఎల్ నిర్మించిన షెడ్లు, ఇండస్ట్రీస్‌ను బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ జరిగింది. అయితే తనకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే అధికారులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. పలువురు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఆందోళనకు దిగడంతో కూల్చివేత ప్రదేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పోలీసులు వారిని అడ్డుకొని కూల్చివేత పనులను పూర్తి చేయించారు.
We’re now on WhatsApp. Click to Join
రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేసే సందర్భంగా కూడా ఉద్రిక్తత ఏర్పడింది. హైడ్రా (Hydra) అధికారులను కొందరు వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని వారు ప్రశ్నించారు. తాము ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నామని వాదనకు దిగారు. ఇళ్లను కూల్చేందుకు తాము అంగీకరించమని పేర్కొన్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియను పూర్తిచేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు సైతం పేదల ఇళ్లు కూల్చవద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా సొంత పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు అనే తేడా లేకుండా చెరువుల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుండటంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోనూ హైడ్రా లాంటి విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా లాంటి విభాగాలు ఉండాల్సిందే అని ప్రజానీకం అంటున్నారు.